Advertisement
రెండు నెలలకోసారి పార్టీ మారుతున్నారని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురించి వార్తలు రావడం కామన్ అయిపోయింది. ముందుగా ఓ ఛానల్ లో బ్రేకింగ్ రావడం.. తర్వాత వరుసబెట్టి మిగిలిన ఛానల్స్, వెబ్ సైట్స్ అందుకోవడం జరుగుతూ వస్తోంది. అయితే.. అదంతా తప్పుడు ప్రచారమని కోమటిరెడ్డి ఖండించడం కూడా కామన్ అయిపోయింది. తాజాగా మరోసారి ఆయనపై పార్టీ మార్పు వార్తలు వస్తున్నాయి. ఎప్పటిలాగే ఆ వార్తలను ఖండించారు కోమటిరెడ్డి.
Advertisement
తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలను నమ్మవద్దన్నారు ఎంపీ. మీడియా సంస్థలు ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. తాను అధికారికంగా ప్రకటించేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఛానల్స్ లో వస్తున్న బ్రేకింగ్స్ పై స్పందించారు. అలాగే, తాను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాననడం తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు.
Advertisement
మొన్న రాహుల్ గాంధీ అనర్హతను నిరసిస్తూ గాంధీభవన్ లో చేసిన దీక్షలో పాల్గొన్నానని గుర్తు చేశారు కోమటిరెడ్డి. ఇటు భువనగిరి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని వివరించారు. తన ముందు ఎలాంటి ఆప్షన్స్ లేవని.. తనది కాంగ్రెస్ రక్తం అని స్పష్టం చేశారు. బీజేపీ నుంచి ఎలాంటి ఆఫర్లు రాలేదన్న ఆయన.. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాల్సిన అవసరం తనకు లేదని తెలిపారు. అలాగే, కొత్త పార్టీ పెడుతున్నానని తప్పుడు వార్తలు ప్రచారం చేయకండని కోరారు.
తాను పార్టీ మారతాననేది ఊహాగానమేనని.. గతంలోనూ ఇలాంటి తప్పుడు ప్రచారాలను చేశారన్నారు కోమటిరెడ్డి. అవాస్తవాలను ప్రచారం చేసి కొందరు లబ్ధి పొందాలని అనుకోవడం హుందాతనం అనిపించుకోదని చెప్పారు. కాంగ్రెస్ లో 35 ఏళ్లుగా పని చేస్తున్నానని.. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు. మరోసారి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు వెంకట్ రెడ్డి.