Advertisement
ప్రతిభ గల విద్యార్థులు, యువత ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నా సాయం చేసేందుకు ముందుకు వచ్చేవారిలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందుంటారు. ఓవైపు తన ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయన.. ఇంకోవైపు పేద విద్యార్థులకు బాసటగా నిలుస్తూ ఉంటారు. ఇప్పటిదాకా ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యేందుకు తన వంతు సాయం అందించారు. తాజాగా నల్గొండ జిల్లాలో ఇద్దరికి ఆర్థిక సాయం చేశారు.
Advertisement
నార్కెట్ పల్లి మండలంలో ఇద్దరు యువకులకు అండగా నిలబడ్డారు వెంకట్ రెడ్డి. కొండపాకగూడేనికి చెందిన సాయితేజ కబడ్డీలో రాణిస్తున్నాడు. జాతీయస్థాయి జట్టుకు కూడా ఎంపికయ్యాడు. ఈనెల 9న మహారాష్ట్రలో జరిగే పోటీల్లో కూడా పాల్గొనాల్సి ఉంది. అయితే.. సాయితేజది నిరుపేద కుటుంబం. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ.. ఆ యువకుడికి రూ.25వేలు ఆర్థిక సాయంగా అందించారు.
Advertisement
ఇక శాపల్లి గ్రామానికి చెందిన మధు అనే యువకుడు ఆర్థిక కష్టాల్లో ఉన్నాడు. తల్లిదండ్రులను చిన్న వయసులోనూ పోగొట్టుకున్నాడు. అమ్మమ్మ దగ్గరే ఉంటూ పెరిగాడు. అయితే.. ఆమె కూడా ఈమధ్యే కాలం చేసింది. దీంతో మధు అనాధ అయ్యాడు. పదో తరగతి వరకే చదివిన మధు.. ఉన్నత చదువులు చదివే స్థోమత లేక కుల వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
మధు పరిస్థితి గురించి తెలిసిన వెంకట్ రెడ్డి అతడికి సాయం చేయాలనుకున్నారు. ఆ గ్రామానికి వెళ్లి రూ.50వేల ఆర్థిక సాయం అందించారు. అంతేకాదు ఇల్లు కూడా నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ సేవాగుణంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. పేద విద్యార్థులకు ప్రతిభ గల వారికి ఆపన్నహస్తం అందిస్తుండడంపై నియోజకవర్గంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.