Advertisement
నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లిలో మీడియాతో మాట్లాడారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయ సముద్రం-బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పనులు స్పీడప్ అయ్యాయని.. ఏప్రిల్ మొదటి వారంలో ట్రయల్ రన్ ఉంటుందని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ చెప్పినట్లు తెలిపారు. ఏప్రిల్ చివరిలో దాదాపు 40వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు.
Advertisement
బ్రాహ్మణ వెల్లెంల కు నీళ్లు రావాలంటే ముందు సొరంగమార్గం పూర్తవ్వాలని గతంలో ప్రభుత్వానికి లేఖ రాశానని గుర్తు చేశారు కోమటిరెడ్డి. సీఎం కేసీఆర్ స్పందించి.. అధికారులకు చెప్పి పనులు స్పీడప్ చేయించారని అన్నారు. ఇవాళ పనులు 5 నుంచి 7 మీటర్ల వరకు జరుగుతున్నాయని.. సొరంగం పనులు పూర్తయితే నల్గొండ జిల్లాకు సాగు, తాగునీటికి ఇబ్బందులు ఉండవని తెలిపారు.
Advertisement
ఇక వైరల్ అయిన ఆడియో కాల్ పై మరోసారి స్పందించిన కోమటిరెడ్డి.. తనపై నమోదైన కేసును కోర్టులోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. న్యాయస్థానంపై, న్యాయమూర్తులపై తనకు గౌరవం ఉందని తెలిపారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని.. సోషల్ మీడియా వచ్చాక భయం, గౌరవం లేకుండా ఎవరుపడితే వారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే వివరణ ఇచ్చానని అన్నారు.
మరోవైపు కవితకు ఈడీ నోటీసులపై వెరైటీగా స్పందించారు వెంకట్ రెడ్డి. ఈ అంశంపై మీడియా ప్రతినిధులు స్పందించమని కోరగా… దీనిపై స్పందించాల్సింది తాను కాదని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని అన్నారు. కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాత ఇంతవరకు రేవంత్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.