Advertisement
ఎన్నో ఆశలతో రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ పదవిని దక్కించుకున్నారు. కానీ, ఆయనకు అడుగడుగునా గండాలే ఎదురయ్యాయి. ఓవైపు సీనియర్లు పట్టించుకోని పరిస్థితి. ఇంకోవైపు ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ కు డిపాజిట్ దక్కని దుస్థితి. కానీ, వచ్చే ఎన్నికల్లో అధికారం మాత్రం పక్కా అని చెబుతున్నారు. మరోవైపు కొందరు నేతలు పార్టీని వీడుతూ రేవంత్ నాయకత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టింది ఏఐసీసీ. తాజాగా టీపీసీసీ కొత్త కమిటీలను ప్రకటించింది.
Advertisement
రేవంత్ చైర్మన్ గా ఉన్న ఎగ్జిక్యూటివ్ కమిటీలో 40 మందికి చోటు ఇచ్చింది. మాణిక్కం ఠాకూర్ ఛైర్మన్ గా 18 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని కూడా నియమించింది. జగ్గారెడ్డి, అంజన్ కుమార్, అజారుద్దీన్, మహేష్ గౌడ్ ను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ప్రకటించింది. అంతే కాకుండా.. 26 జిల్లాల్లో కొత్త అధ్యక్షులకు బాధ్యతలు అప్పజెప్పింది. సీనియర్ నాయకులందరికీ ఏదో కమిటీలో చోటు దక్కింది. కానీ, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు మాత్రం ఎందులోనూ కనిపించలేదు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Advertisement
టీపీసీసీ పదవి కోసం వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య గట్టి పోటీ నడిచింది. అధిష్టానం మాత్రం రేవంత్ కే మద్దతు తెలిపింది. అయితే.. ఈ పదవి కోసం ఆయన కోట్లు కుమ్మరించారని పార్టీని వీడుతున్న నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. రేవంత్ ఎంపిక సమయం నుంచి కోమటిరెడ్డి పార్టీకి కాస్త దూరంగానే ఉంటున్నారు. మధ్యలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే.. రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడాక వెంకట్ రెడ్డి కూడా టార్గెట్ అయ్యారు. సొంత పార్టీ నేతలే కాస్త అతిగా తిట్టారు. చివరకు రేవంత్ రెడ్డి సారీ చెప్పాల్సి వచ్చింది. ఈ పంచాయితీలు సాగుతుండగానే.. రెండుసార్లు షోకాజ్ నోటీసులు అందుకున్నారు కోమటిరెడ్డి.
ఈమధ్య తిరుమల వెళ్లిన ఆయన.. కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతానికి తాను పాలిటిక్స్ కు దూరంగా ఉన్నానని చెప్పారు. అంతటితో ఆగకుండా తాను ఏ పార్టీలో చేరతానన్నది ఎన్నికలకు ఒక నెల ముందుగా డిసైడై చెప్తానని బాంబు పేల్చారు. ఇదే క్రమంలో కొత్త కమిటీలు ప్రకటించడం.. అందులో ఆయన పేరు లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో కోమటిరెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుంది. ఆయన ఎలాంటి స్టెప్ తీసుకోనున్నారనే క్యూరియాసిటీ అందరిలో నెలకొంది.