Advertisement
ఉదయం లేచింది మొదలు.. కేసీఆర్, కేటీఆర్ ను తిట్టిపోసుకోవడంలో ముందుంటారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రతిపక్షం కాబట్టి.. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న ఉద్దేశంతో ఏదిపడితే అది మాట్లాడుతుంటారు. అయితే.. బీఆర్ఎస్ వర్గాల నుంచి అదే స్థాయిలో కౌంటర్లు వస్తుంటాయి. ఒక్కోసారి వీరి పంచాయితీ పీక్ స్టేజ్ కు చేరుతుంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. బండి సంజయ్ ను ఓ ఆటాడుకున్నారు.
Advertisement
ఈమధ్యే సెస్ ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టు పోరు సాగింది. కానీ, చివరకు అత్యధిక సీట్లు బీఆర్ఎస్ కే దక్కాయి. పాలకవర్గం కొలువుదీరింది. అయితే.. బీఆర్‌ఎస్ విజయం సందర్భంగా వినియోగదారులు, రైతులతో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సెస్ ఎన్నికల్లో బండి సంజయ్ రూ.5 కోట్లు పంచారని ఆరోపించారు. అభ్యర్థులే ఫోన్లు చేసి తనకు ఈ విషయం చెప్పారని అన్నారు.
Advertisement
సెస్ ఎన్నిక ట్రైలర్ మాత్రమేనని.. 2023లో బీజేపీకి అసలు సినిమా చూపిస్తామని హెచ్చరించారు కేటీఆర్. అసలు.. ఈ ఎన్నికలోనే గెలవలేని వాళ్లు రాష్ట్రంలో గెలుస్తారా అని చురకలంటించారు. ట్రిపుల్ ఐటీ, నవోదయ పాఠశాలలు బండి తీసుకొచ్చారా? అంటూ నిలదీశారు. రాజరాజేశ్వర స్వామికి రూ.10 చందా అయినా రాయించారా? అంటూ ధ్వజమెత్తారు. ఈసారి సిరిసిల్ల నుంచి విజయయాత్ర ప్రారంభించి.. కరీంనగర్ పార్లమెంట్ పై గులాబీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లింది ఎంత.. తిరిగి తెలంగాణకు ఇచ్చిందెంత అని ప్రశ్నించారు కేటీఆర్. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మరోసారి సవాల్ విసిరారు. చేనేతపై పన్ను వేసిన ప్రధాని దేవుడెలా అవుతారని.. గుజరాత్ నాయకుల చెప్పులు మోయడమే మీ పని అని బండి ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా సంజయ్ కరీంనగర్ కు ఏం చేశారో చెప్పాలని కేటీఆర్ నిలదీశారు. దమ్ముంటే తమకంటే ఎక్కువగా మంచి పనులు చేసి ప్రజల మనసులను గెలవాలని హితవు పలికారు.