Advertisement
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. వరుస రాజకీయ సంక్షోభ పరిణామాల మధ్య ఆమె పదవి నుంచి దిగిపోక తప్పలేదు. నిజానికి తాను పదవిలోనే కొనసాగుతానని, చేసిన పొరబాట్లను సరిదిద్దుకుంటానని లిజ్ ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ, ఆ ఛాన్స్ ఇవ్వలేదు ఎంపీలు. ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో సతమతమవుతున్న బ్రిటన్ లో పరిస్థితులు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో పదవి నుంచి తప్పుకున్నారు ఆమె.
Advertisement
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన 44 రోజుల్లోనే లిజ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ పనితీరు పట్ల సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు రావడం, ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పడంతో లిజ్ ట్రస్ పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో బ్రిటన్ చరిత్రలో అత్యంత తక్కువ కాలం ప్రధానిగా వ్యవహరించిన వ్యక్తిగా ఈమె రికార్డుల్లోకెక్కారు. మినీ బడ్జెట్ తో పాటు ఆర్థిక సంక్షోభం కారణంగా ఇప్పటికే పలువురు మంత్రులు రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రధాని కూడా తప్పుకోవడం కలకలం రేపింది.
దేశం ఆర్థికంగా తిరోగమిస్తోందని కన్సర్వేటివ్ పార్టీ ఎంపీల్లో పలువురు ఆరోపిస్తూ లిజ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. దేశంలో నాయకత్వ మార్పు జరగాలని కొన్ని రోజులుగా పట్టు పడుతున్నారు. చివరకు చేసేది లేక ఆమె పదవి నుంచి వైదొలిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… భావోద్వేగానికి లోనయ్యారు. కన్సర్వేటివ్ లీడర్ పోస్టుకు పోటీ చేస్తున్నప్పుడు ప్రజలకు హామీలిచ్చానని, కానీ వాటిని నెరవేర్చలేకపోయానని చెప్పారు.
Advertisement
తన పార్టీ విశ్వాసాన్ని పొందడంలో విఫలమయ్యానన్న ఆమె.. కన్సర్వేటివ్ పార్టీ తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోయానని అన్నారు. అందువల్లే పార్టీ నాయకురాలిగా రాజీనామా చేస్తున్నానని రాజుకు తెలియజేశాను అని తెలిపారు. లిజ్ ట్రస్ ఇటీవల ప్రవేశ పెట్టిన మినీ బడ్జెట్ మార్కెట్ వర్గాలను కుదిపివేసింది. విమర్శలు వెల్లువెత్తడంతో కొత్త ఆర్ధిక మంత్రి హంట్ ఈ బడ్జెట్ ప్రతిపాదనలను మార్చివేశారు. ఇక బ్రిటన్ కొత్త ప్రధాని ఎవరు అవుతారన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. భారత సంతతికి చెందిన మాజీ మంత్రి రిషి సూనక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన తరువాత పెన్నీ మోర్డాంట్, బెన్ వాలెస్ పేర్లు బయటికి వచ్చాయి.