Advertisement
టీడీపీని అధికారంలోకి తీసుకురావడం.. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టమే లక్ష్యంగా నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం యాత్ర మదనపల్లి నియోజకవర్గంలో కొనసాగుతోంది. లోకేష్ వెంట అడుగులో అడుగేస్తూ టీడీపీ శ్రేణులు కదులుతున్నారు. దారి పొడవునా ప్రజల సమస్యలు వింటూ, టీడీపీ ప్రభుత్వం రాగానే నెరవేరుస్తామని చెబుతూ.. ముందుకు సాగుతున్నారు లోకేష్. ఈక్రమంలోనే యువగళం పాదయాత్ర 500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.
Advertisement
పాదయాత్ర 500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మదనపల్లి సీటీఎం దగ్గర లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రతి వంద కిలోమీటర్లకు ఓ శిలాఫలకం ఆవిష్కరిస్తున్నలోకేష్.. వాటిపై తాను ఇచ్చిన హామీలను రాయిస్తున్నారు. ఐదు వందల కిలోమీటర్ల శిలాఫలకంపై కూడా హామీలను చెక్కించారు. మదనపల్లి నియోజకవర్గంలో టమోటా రైతుల కోసం టమోటా ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్‌స్టోరేజ్ ఏర్పాటుకి హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఈ మేరకు వాటిని అమలు చేస్తామని తెలిపారు.
Advertisement
యాత్రలో భాగంగా చేనేత కళాకారులతో ముఖాముఖిగా మాట్లాడారు లోకేష్. వారితో కలిసి రాట్నం తిప్పి నూలు వడికారు. చేనేత రంగం ఎదర్కొంటున్న సంక్షోభాన్ని కార్మికులు లోకేష్ దృష్టికి తెచ్చారు. నేతన్నలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, చేనేత వస్త్రాలకు, పవర్ లూమ్ వస్త్రాలకు తేడా తెలిసేలా.. ప్రత్యేక లేబిలింగ్ చేయాలని కోరారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ తొలగించాలని, ఆప్కో ద్వారా వస్త్రాలు కొనుగోలు చేయడం లేదని, సిల్క్ రాయితీ పాస్ బుక్ ను తిరిగి అమలు చేయాలని కార్మికులు వివరించారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. పవర్ లూమ్ 500 యూనిట్స్ విద్యుత్ ఎత్తేశారని.. వైఎస్సార్ బీమా ఏం చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు. చేనేత కార్మికులకు గుర్తింపులు లేవని.. బీసీ సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదని ఆరోపించారు. రాజకీయంగా వారిని వాడుకుంటున్నారే గానీ, అన్నీ వైసీపీ కార్యకర్తలకు ఇస్తున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే చేనేత వస్త్రాలకు.. ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేస్తామని హామీ ఇచ్చారు. నేతన్న నేస్తం కూడా పెద్ద మోసమని విమర్శించారు.