Advertisement
అనుకున్నదే జరిగింది. మాండౌస్ వాయువేగంతో విరుచుకుపడింది. శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత 1.30 గంటలకు తీరం దాటింది. పుదుచ్చేరి-శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటి ఆ ఏరియాలో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తున్న తుపాను వాయుగుండంగా మారుతుంది. తీరంలో కొనసాగుతున్న అలజడితో మరో రెండురోజులు ఉత్తర తమిళనాడు, దక్షిణ ఏపీలోని జిల్లాల్లో అతిభారీ నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
Advertisement
తుపాను ప్రభావం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అధికంగా ఉంది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరం దాటినప్పటికీ ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తుపాను కారణంగా నాయుడుపేట, గూడూరు, సూళ్లూరుపేటలో భారీ వర్షం కురుస్తోంది. ఈదురు గాలులతో పలు ప్రాంతాల్లో చెట్లు నేలమట్టమయ్యాయి.
Advertisement
భారీవర్షం కారణంగా శేషాచలం అటవీ ప్రాంతం నుంచి వర్షపు నీరు మొత్తం మాల్వాడి గుండం మీదుగా కపిల తీర్థానికి చేరుకుంటోంది. దీంతో భక్తులను కపిలతీర్థం వద్దనున్న పుష్కరిణిలోకి అనుమతించడం లేదు. భారీ వర్షానికి తిరుమలలో వృక్షాలు కూలాయి. ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పాపవినాశనం, శిలాతోరణం మార్గాలను మూసివేశారు.
మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరిలోనూ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. ముఖ్యంగా చెన్నైతో పాటు చెంగల్ పట్టు, కాంచీపురం, విల్లుపురం, కరైకల్, పుదుచ్చేరి సహా పలు ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీచాయి. పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు విరిగి పడ్డాయి. విద్యుత్ స్తంబాలు నెలకొరగడంతో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. చెన్నైలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ జలాశయాలను తలపించాయి. ఈ క్రమంలో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.