Advertisement
ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతోంది. అధికార పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు అంటూ హడావుడి చేస్తోంది. బీజేపీ కూడా ఏదో ఒక కార్యక్రమంతో జోరు మీదుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా యాక్టివ్ కావాలని కాంగ్రెస్ అధిష్టానం నేతలకు పిలుపునిచ్చింది. ఒక రకంగా ఇది వార్నింగ్ లాంటిదే. కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చే అంశంపై దృష్టి సారించి.. జనంలోనే ఉండాలని పిలుపునిచ్చారు పార్టీ పెద్దలు.
Advertisement
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఆదివారం ఇందిరా భవన్ లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. పార్టీ తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వంపై పోరాడాల్సిన విధానాలు, యాక్షన్ ప్లాన్స్, అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చలు జరిపారు.
Advertisement
మీటింగ్ అనంతరం థాక్రే మీడియాతో మాట్లాడారు. పార్టీ కార్యక్రమాలు, హై కమాండ్ ఆదేశాలను బ్రేక్ చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఇక నుంచి పార్టీ మీటింగ్ లు, కార్యక్రమాలకు ఐదు సార్లు రాకపోతే చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. కార్యకర్తల నుంచి లీడర్ల వరకు ఈ రూల్ వర్తిస్తుందని తెలిపారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను అత్యంత బాధ్యతాయుతంగా చేపట్టాలన్నారు థాక్రే.
జంగా రాఘవరెడ్డికి షోకాజ్ నోటీస్
థాక్రే అలా వార్నింగ్ ఇచ్చారో లేదో.. ఆ వెంటనే జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ ను బలహీనపర్చే ప్రయత్నం చేస్తున్నారని, బీఆర్‌ఎస్ కు అనుకూలంగా రాజకీయ పరిస్థితిని మారుస్తున్నారంటూ ఇటీవల హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అదీగాక, ఆదివారం జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రాఘవరెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి నోటీసుల్లో ఆదేశించారు.