Advertisement
తెలంగాణలో ఆదివారం తీవ్ర చర్చనీయాంశమైన అంశం లేడీ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంటికి ఓ వ్యక్తి వెళ్లడం. ప్రభుత్వంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్న ఆమె ఇంటికి డైరెక్ట్ గా ఓ వ్యక్తి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. అతను ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఎవరా అని ఆరా తీసిన పోలీసులకు మేడ్చల్ జిల్లాకు చెందిన డిప్యూటీ తహసీల్దార్ అని తెలిసింది.
Advertisement
జూబ్లీహిల్స్ లో ఉంటున్న స్మితా సబర్వాల్ ఇంటికి డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి డైరెక్ట్ గా వెళ్లాడు. అర్ధరాత్రి సమయంలో ఆమె ఇంటి డోర్ కొట్టాడు. ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు? అని స్మిత గట్టిగా ప్రశ్నించారు. తాను మీ ట్విట్టర్ ని ఫాలో అవుతానని.. డ్యూటీ విషయంలో మాట్లాడేందుకు వచ్చానని చెప్పాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో అప్రమత్తమైన సెక్యూరిటీ డిప్యూటీ తహసీల్దార్ ను పోలీసులకు అప్పగించారు.
Advertisement
అతడ్ని రిమాండ్ కు కూడా తరలించారు. ఆనంద్ కుమార్ రెడ్డితో పాటు ఉన్న మరో వ్యక్తిని కూడా గుర్తించారు. అతడ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ట్విట్టర్ లో స్మితా సబర్వాల్ వివరణ ఇచ్చారు. తనకు ఊహించని ఘటన ఎదురైందని తెలిపారు. ఇది అత్యంత బాధాకరమైన ఘటనగా పేర్కొన్నారు. ‘‘రాత్రి నా ఇంట్లోకి ఓ వ్యక్తి చొరబడ్డాడు. అప్రమత్తతో నా ప్రాణాలు కాపాడుకునా.. మీ ఇంటికి తాళాలు వేసుకోండి.. తలుపులు తనిఖీ చేసుకోండి.. అత్యవసర పరిస్థితిలో డయల్ 100కు కాల్ చేయండి’’ అంటూ పోస్టు పెట్టారు.
అయితే.. స్మిత ట్వీట్ పై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. స్మితా బర్వాల్ వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శికే భద్రత లేదని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించారు. ఇదేనా తెలంగాణ మోడల్ అని ప్రశ్నించారు. డయల్ 100 అని స్మితా సబర్వాల్ అంటుంటే.. కేసీఆర్ 100 పేపర్ బ్రాందీ అంటున్నారని ఎద్దేవ చేశారు రేవంత్ రెడ్డి.