Advertisement
తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫార్ములా ఈ-రేసింగ్ నిర్వహించారు. చిన్న చిన్న లోపాలు మినహా ప్రభుత్వం సహకరించి ఎంతో చక్కగా ఈ రేసింగ్ ను ముగించింది. అయితే.. మొదట్నుంచి దీనివల్ల ఇబ్బందులు పడింది నగరవాసులే. నిత్యం ఎన్టీఆర్ మార్గ్ రూట్ లో వందల వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఈ రేసింగ్ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లు బ్లాక్ చేయడంతో ఇతర మార్గాల్లో ట్రాఫిక్ తో నరకం అనుభవించారు. కొన్నిచోట్ల పోలీసులు, అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్న వీడియోలు బయటకొచ్చాయి.
Advertisement
రేసింగ్ ముగింపు సందర్భంగా మంత్రి కేటీఆర్ వాహనదారుల కష్టాలపై స్పందించారు. ఈ రేసింగ్ వల్ల ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు ఏర్పడిన మాట వాస్తవమేనని పెద్ద మనసుతో క్షమించాలని కోరారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చే క్రమంలో కొంత ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో హైదరాబాద్ బ్రాండ్ అంతర్జాతీయ స్థాయిలో మార్మొగుతుందని చెప్పారు.
Advertisement
అయితే.. ఈ రేసింగ్ పై ప్రతిపక్షాలు అభ్యంతరం చెబుతున్నాయి. యూత్ కాంగ్రెస్ సభ్యులు ఖైరతాబాద్ జంక్షన్ వద్ద ఆందోళన చేపట్టారు. కార్ రేసింగ్ వల్ల ఎవరికీ ఉపయోగం లేదని నిరసన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా ఖైరతాబాద్ జంక్షన్ వద్ద వచ్చిన యూత్ కాంగ్రెస్ నేతలు, నెక్లెస్ రోడ్డువైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
ఎన్ఎస్యూ ఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ స్పందిస్తూ.. కొత్త సచివాలయాన్ని ప్రమోషన్ చేసుకోడానికే ఫార్ములా ఈ-రేసింగ్ ను ఏర్పాటు చేశారన్నారు. ప్రజలకు కావాల్సింది ఈ రేసింగ్ లు కాదన్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పెట్టాల్సిన రేసింగ్ ను నడిబొడ్డున పెట్టి సిటీ జనులకు చుక్కలు చూపించారని మండిపడ్డారు. ఈ రేస్ నిర్వహించడం వలన సామాన్యులకు అవస్థలు ఎదురయినా.. ప్రభుత్వానికి పట్టింపు లేకుండా వ్యవహరించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.