Advertisement
టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజ్ చుట్టూ మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రతిపక్ష నేతలు రేవంత్, బండిసంజయ్ పోటీపడి మరీ మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. లీకేజ్ వెనుక కర్త, కర్మ, క్రియ అంతా కేటీఆరే అని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇటు కేటీఆర్ మాత్రం తనకేం సంబంధం లేదని చెబుతున్నారు. అయినా కూడా ప్రతిపక్ష నేతలు మాటల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో వీళ్ల సంగతి ఇలా కాదని లీగల్ నోటీసులు పంపించారు మంత్రి కేటీఆర్. దీంతో ఈ వ్యవహారం ఇంట్రస్టింగ్ గా మారింది.
Advertisement
టీఎస్పీఎస్సీ వ్యవహారంలో రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును అనవసరంగా లాగుతున్నారని వీరిద్దరికి తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులను పంపించారు కేటీఆర్. సుదీర్ఘ కాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతోనే బండి, రేవంత్ పదేపదే అబద్దాలను మాట్లాడుతున్నారన్నారు. కేవలం ప్రజాప్రతినిధిగా ఉన్నంత మాత్రాన ఎదుటి వారిపైన అసత్య ప్రేలాపనాలు చేసే హక్కు వారికి లేదని పేర్కొన్నారు.
Advertisement
ఇండియన్ పీనల్ కోడ్ లోని 499, 500 నిబంధనల ప్రకారం పరువు నష్టం దావా నోటీసులు పంపించారు కేటీఆర్. ఎలాంటి ఆధారాలు లేని సత్య దూరమైన ఆరోపణలను మానుకోవాలని, ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని అందులో డిమాండ్ చేశారు.
వారం రోజులలోగా తమ వ్యాఖ్యలను వెనుకకు తీసుకొని క్షమాపణ చెప్పకుంటే 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ తన నోటీసులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు చేసిన నిరాధార ఆరోపణలను సాక్షాలతో సహా తన నోటీసులను కేటీఆర్ ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఇది ఎటు దారితీస్తుందో తెలియడం లేదు.