Advertisement
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్నం లీకేజ్ ఇష్యూలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాను చేసిన ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలని సిట్ నోటీసులు ఇవ్వగా.. ఆయన విచారణకు హాజరయ్యారు. అయితే.. ఆయన ఇచ్చిన ఆధారాలు సరైనవి కావని సిట్ కఠిన చర్యలకు పూనుకోవాలని చూస్తోంది. రేవంత్ పై కేసు పెట్టొచ్చని వార్తలు వస్తున్నాయి. ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు కూడా నోటీసులు అందాయి. అయితే.. ఆయన విచారణకు హాజరయ్యే విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ వీళ్లద్దరికీ ఝలక్ ఇచ్చారు.
Advertisement
రేవంత్, సంజయ్ లకు లీగల్ నోటీసులు పంపారు కేటీఆర్. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలోకి రాజకీయ దురుద్దేశంతోనే తనను లాగుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. తనపై అనవసరంగా నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నందుకు లీగల్ నోటీసులు పంపిస్తున్నట్టు తెలిపారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంలో తన పేరును లాగుతూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర చేస్తున్నారని.. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు స్వయం ప్రతిపత్తి ఉంటుందన్న కనీస అవగాహన లేకుండా ఈ అంశంలోకి ప్రభుత్వాన్ని, తనను లాగడం వారి అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు కేటీఆర్.
Advertisement
ఇప్పటికే వీళ్లిద్దరు తమ తెలివి తక్కువ ప్రకటనలు, మతిలేని మాటలతో ప్రజల్లో చులకన అయ్యారని గుర్తుచేశారు. గతంలో కరోనా సమయంలో పదివేల కోట్ల వ్యాక్సిన్ కుంభకోణం జరిగిందని, వేల కోట్ల విలువచేసే నిజాం నగల కోసమే పాత సచివాలయం కూల్చివేస్తున్నారనే తలతిక్క వ్యాఖ్యలు చేసి రేవంత్ రెడ్డి నవ్వులపాలయ్యారని వివరించారు. ఇక తెలివి తక్కువతనంలో రేవంత్ తో బండి పోటీపడుతున్నారని చమత్కరించారు. శవాలు-శివాలు, బైక్ పోతే బైక్ ఫ్రీ అంటూ బండి సంజయ్ చేసిన అర్థరహిత వ్యాఖ్యలు కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారని తెలిపారు.
వీళ్లిద్దరి వ్యవహారశైలిని గమనించిన తరువాత, మానసిక స్థితి సరిగ్గా లేదేమో అని ప్రజలే అనుకుంటున్నట్టు చెప్పారు కేటీఆర్. వీరిద్దరి నాయకత్వంలో కాంగ్రెస్, బీజేపీ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని సెటైర్లు వేశారు. తలా తోక లేకుండా మాట్లాడుతున్న ఈ రెండు పార్టీల నేతల పిచ్చిమాటల ఉచ్చులో పడకుండా యువత తమ పోటీ పరీక్షల సన్నద్ధతపైనే దృష్టి సారించాలని సూచించారు. టీఎస్పీఎస్సీ ఇప్పటికే దిద్దుబాటు చర్యలను ప్రారంభించిందని భవిష్యత్ లో నిర్వహించే పరీక్షలను మరింత కట్టుదిట్టంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించేందుకు సన్నద్ధమవుతుందని తెలిపారు కేటీఆర్.