Advertisement
తెలంగాణ సంచలనం రేపుతోంది టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఇష్యూ. అంతా ప్రభుత్వ కుట్ర అని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే.. ఇద్దరు వ్యక్తులు చేసిన దాన్ని మొత్తానికి ఆపాదించొద్దని సర్కార్ అంటోంది. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష జరపడం ఆసక్తిని రేకెత్తించింది. టీఎస్పీఎస్సీని రద్దు చేశారనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ సమావేశానికి మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, సీఎస్ శాంతి కుమారి, టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డితో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు.
Advertisement
సమావేశం తర్వాత బీఆర్కే భవన్ లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పబ్లిక్ కమిషన్ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 37వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. ఏ పరీక్షపై కూడా ఆరోపణలు రాలేదని గుర్తు చేశారు. పారదర్శకత తీసుకురావాలని అనేక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. యూపీఎస్సీ చైర్మన్ రెండుసార్లు తెలంగాణకు వచ్చి టీఎస్పీఎస్సీని విజట్ చేసి అధ్యయనం చేశారన్నారు.
Advertisement
తనపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ఐటీ మంత్రి అయితే.. రాష్ట్రంలో ఉన్న ప్రతీ కంప్యూటర్ కు బాధ్యుడా? అని ప్రశ్నించారు. అసలు, ఐటీ మంత్రి ఏం చేస్తాడో తెలుసా? అని అడిగారు. పేపర్ లీకేజ్ కి ఐటీ మంత్రికి ఏం సంబంధమని మండిపడ్డారు. పేపర్ లీక్ అయితే తానెందుకు రాజీనామా చేయాలని నిలదీశారు. అసోం, యూపీ, గుజరాత్ లో పేపర్ లీక్ లు జరిగాయి అక్కడ మంత్రులు రాజీనామా చేశారా? అని అడిగారు.
నిందితుడు రాజశేఖర్ రెడ్డి బీజేపీ కార్యకర్త అని చెప్పిన కేటీఆర్.. అతని వెనుక ఎవరైనా ఉన్నారా? ఏదైనా కుట్రకోణం ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేయాలని డీజీపీని కోరుతున్నానని తెలిపారు. తాను నిరాధారంగా మాట్లాడటం లేదని.. బీజేపీ కార్యకలాపాల్లో రాజశేఖర్ పాల్గొంటున్నారని అన్నారు. బీజేపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడని.. ఆ పార్టీకి ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తున్న ఫోటోలు కూడా ఉన్నాయని వివరించారు. అలాంటి వ్యక్తి దీని వెనుకాల ఉన్నాడంటే తమకు అనుమానం ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా రాజకీయ పార్టీలపై అసహనం వ్యక్తం చేశారు కేటీఆర్. పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని సూచించారు. మీ ప్రయోజనాల కోసం, ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసం, పిల్లల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడం సరికాదన్నారు.