Advertisement
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 58 జీఓ కింద 3,613 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాల్లారెడ్డి, శాసన మండలి విప్ శంభీపూర్ రాజు సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్య గత ప్రభుత్వాల శాపమన్నారు. జవహర్ నగర్ కు వచ్చే చెత్త ద్వారా 100 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చన్నారు. ప్రస్తుతం 20 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని పేర్కొన్నారు.
Advertisement
ఇటు జవహర్ నగర్ లో లీచెట్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను ప్రారంభించారు. డంప్ యార్డ్ తో కలుషితమవుతున్న భూగర్భ జలాలు, చెరువులకు పునర్వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు కేటీఆర్. ఈ దుర్గంధ సమస్యను గత ప్రభుత్వాలు వారసత్వంగా ఇచ్చాయని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఏదైనా చేయొచ్చని ప్రతిపక్షాలను ఉద్దేశించి మాట్లాడారు కేటీఆర్. 50 ఏళ్లు అధికారంలో ఉండి అభివద్ధి చేయలేదని.. అలాంటిది ఇప్పుడు అవకాశం ఇస్తే ఎలా చేస్తారని ప్రశ్నించారు. వాళ్లను అసలు నమ్మకండి అని సూచించారు.
Advertisement
జవహర్ నగర్ గుట్టపై వాన కురిసి.. చెత్త నుంచి నీరు వచ్చి.. రసాయనంలా కలుషితమై మల్కారం చెరువులోకి చేరిందన్నారు కేటీఆర్. దీనివల్ల నీరంతా కలుషితమై నల్లగా మారిందని.. దాన్ని తెల్లగా మార్చేందుకు కొత్త లీచెట్ ట్రీట్ మెంట్ ప్లాంట్ తీసుకొచ్చామన్నారు. 250 కోట్లు వెచ్చించి మల్కారం చెరువులో చెత్త నుంచి రసాయనాలతో నల్లగా మారిన నీటిని శుద్ధి చేసేందుకు మిషనరీలు పెట్టామని తెలిపారు. ఏడాది, ఏడాదిన్నర వ్యవధిలో చెరువును శుద్ధి చేసి మంచినీటిని దిగువకు పంపిస్తామని చెప్పారు.
550 కోట్లతో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మించామన్న కేటీఆర్.. ఇప్పుడు నీటిని శుద్ధి చేసే ప్లాంట్ ను 250 కోట్లతో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇక రెండో దశ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ మరో 550 కోట్లతో నిర్మించనున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా తన జపాన్ పర్యటన గురించి చెప్పారు కేటీఆర్. జపాన్ ప్రపంచంలోనే అత్యున్నత జీవన ప్రమాణాలతో ఉండే నగరమని.. అక్కడ ఇలాగే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ దగ్గరికి వెళ్లామన్నారు. అక్కడ పైన పార్క్.. కింద ప్లాంట్ ఉందని ఏ మాత్రం వాసన లేదని తెలిపారు. ఏడాదికో, 18 నెలలకో జవహర్ నగర్ లో, దమ్మాయిగూడలో, నాగారం గూడలో కూడా ఇదేవిధంగా చేస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్.