Advertisement
వైసీపీ ప్రభుత్వాన్ని కూలుస్తామని గట్టిగా చెబుతున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. అయితే.. మీ పార్టీకి అభ్యర్థులు ఉన్నారా? అని కౌంటర్ ఇస్తున్నారు మంత్రి రోజా. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. పవన్ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీని చంద్రసేనగా అభివర్ణించారు. జనసేన పేరు మార్చి కన్ఫ్యూజన్ పార్టీ అని పెట్టుకుంటే మంచిదని సెటైర్లు వేశారు.
Advertisement
పవన్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆయనకే తెలియదన్నారు రోజా. సీఎం కాలేనని పవన్ కి కూడా అర్థమైపోయింది కాబట్టే, చంద్రసేనకి సైనికుడిగా ఉండేందుకు తాపత్రయ పడుతున్నారని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీకి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులే లేరని విమర్శించారు. టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని పవన్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
Advertisement
ఇక లోకేష్ పాదయాత్రపైనా చురకలంటించారు. జగన్ కు, లోకేష్ కు పోలిక ఏంటని ప్రశ్నించారు. లోకేష్ పాదయాత్రకు ఆంక్షలపై టీడీపీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రోజా చేసిన వ్యాఖ్యలు మరింత హీట్ ను పెంచాయి. పాదయాత్ర మొదటి రోజే లోకేష్ కు అంత సీన్ లేదని అర్థం అయిపోతుందని విమర్శించారు. లోకేష్ పాదయాత్ర చేయగానే రాజకీయంగా ఏదో అయిపోతుందనే భ్రమలో టీడీపీ ఉందన్నారు. అది యువగళం కాదు.. టీడీపీకి సర్వమంగళం అని వ్యంగ్యంగా కామెంట్ చేశారు.
మరోవైపు బాలయ్యనూ వదల్లేదు రోజా. వీర సింహారెడ్డి సక్సెస్ కార్యక్రమంలో అక్కినేని, తొక్కినేని.. ఆ రంగారావు, ఈ రంగారావు అంటూ మాట్లాడారు బాలకృష్ణ. ఈ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు రోజా. ఎన్టీఆర్ ని అవమానిస్తే మీకెలా ఉంటుందని ప్రశ్నించారు. ఏఎన్నార్ గురించి ఆ విధంగా తప్పుగా మాట్లాడడం సరైంది కాదన్నారు. అక్కినేని కూడా ఎన్టీఆర్ తరహాలోనే మహానటుడని వ్యాఖ్యానించారు. తప్పును తప్పు చెబితే.. బాలయ్య ఎప్పుడూ సరిదిద్దుకోడంటూ విమర్శించారు మంత్రి రోజా.