Advertisement
మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ 25 కోట్లు ఇచ్చారనేది ఈటల రాజేందర్ ప్రధాన ఆరోపణ. అయితే.. దీనిపై రేవంత్ రెడ్డి బాగా హర్టయ్యారు. ఈటల తననే అన్నారని ఆపాదించుకుని తెగ హడావుడి చేశారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లి.. కన్నీరు పెట్టుకున్నారు. ఇది మీడియాలో బాగా హైలైట్ అయింది. అలాగే, ఈటల ప్రమాణం చేసేందుకు వెళ్లకపోవడంతో.. సోషల్ మీడియాలో రేవంత్ ఏడ్చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి.
Advertisement
రేవంత్ తనను ఉద్దేశించి అమ్మ, యబ్బ అంటూ చేసిన వ్యాఖ్యలపై ఈటల గట్టిగానే రియాక్ట్ అయ్యారు. రేవంత్ పాత చరిత్ర అంతా బయటకు తీసి విమర్శల దాడి కొనసాగించారు. ధీరుడి లెక్క కొట్లాడతాడు అనుకుంటే.. కన్నీళ్లు పెడతాడు అని అనుకోలేదని వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. అసలు, రేవంత్ కు తనకు పోలికేంటని ప్రశ్నించిన ఈటల… తెలంగాణ ఉద్యమంలో ఆయన ఎక్కడున్నారని ప్రశ్నించారు. నువ్వు జైలుకెళ్లింది జనం కోసం కాదు.. ఓటుకు నోటు కేసులో అనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు.
Advertisement
తాను రేవంత్ రెడ్డి పేరు ఎక్కడా ప్రస్తావించలేదని, పార్లమెంట్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఉన్నాయని చెప్పారు రాజేందర్. రేవంత్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎంతో అసభ్యంగా మాట్లాడారని.. రాజకీయ నేతలు కన్నీళ్లు పెట్టడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. తాను విద్యార్థి నేతగా ఉన్నప్పటి నుంచే పోరాటాలు చేస్తున్నానని, ఓటుకు నోటుకు కేసులో రేవంత్ జైలుకువెళ్లి వచ్చారని, ఆయన సంస్కారహీనంగా మాట్లాడారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని ఖర్గే ఒక ఇంటర్వ్యూలో చెప్పారని.. జానారెడ్డి, కోమటిరెడ్డి కూడా అలాగే మాట్లాడారన్నారు ఈటల. ఇవన్నీ నిజం కాదా అని నిలదీశారు. బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని భావించే రేవంత్ ఏడ్చినట్టు ఉందని వ్యంగ్యంగా మాట్లాడారు. అసలు, రేవంత్ రెడ్డికి తల్లి లేదా.. ఇదేం సంస్కారం అంటూ మండిపడ్డారు. తనది అయ్య తోడు.. అవ్వ తోడు కల్చర్ కాదని స్పష్టం చేశారు. వంద శాతం బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు ఉంటుందన్నారు. ఇప్పటికైనా బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు ఈటల రాజేందర్.