Advertisement
బీఆర్ఎస్ లీడర్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణ అనేక ట్విస్టులతో సాగింది. నోటీసులు ఇచ్చిన దగ్గర నుంచి రోహిత్ పేరు మీడియాలో మార్మోగుతూనే ఉంది. 19న విచారణకు రావాలని నోటీసులు వచ్చాక సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. అధికారుల ముందు ఏం మాట్లాడాలి.. ఏం చేయాలి అన్న దానిపై గులాబీ బాస్ క్లాస్ తీసుకున్నారు. విచారణకు సహకరిస్తానని తెలిపారు రోహిత్. అయితే.. రెండు రోజులపాటు భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి హడావుడి చేశారు.
Advertisement
బీజేపీ నేతలు తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని.. ప్రమాణానికి సిద్ధమా అంటూ సవాల్ చేశారు. బండి సంజయ్, రఘునందన్ రావులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోహిత్ లాంటి వారి సవాళ్లకు కూడా స్పందించాలా? అంటూ బండి లైట్ తీసుకోగా.. రఘునందన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చివరకు ఈడీ విచారణకు సమయం రానే వచ్చింది. అందరూ రోహిత్ రెడ్డి ఇంట్లో నుంచి ఎప్పుడు బయటకొస్తారా? అని ఎదురుచూశారు. ఆయన వాహనం బయటకు రాగానే మీడియా వాళ్ళు వెంబడించారు. ఈడీ ఆఫీస్ కు కాకుండా యూటర్న్ తీసుకుని కేసీఆర్ దగ్గరకు వెళ్లారు ఆయన.
Advertisement
కేసీఆర్ తో భేటీ తర్వాత విచారణకు హాజరు కాలేనంటూ తన పీఏకు లేఖ ఇచ్చి ఈడీ దగ్గరకు పంపారు రోహిత్. తనకు చాలా తక్కువ సమయం ఇచ్చారని.. వరుస సెలవులు కావడంతో బ్యాంక్ స్టేట్ మెంట్లు, తదితర ఆధారాలు సేకరించలేకపోయానని లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. ఈనెల 31 తర్వాత విచారణ పెట్టుకోవాలని కోరారు. అయితే.. రోహిత్ రెడ్డి అభ్యర్థనను ఈడీ తిరస్కరించింది. హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు తమ కార్యాలయానికి రావాలని తెలిపింది.
అధికారుల ఆదేశాలతో చేసేదేం లేక విచారణకు హాజరయ్యారు రోహిత్ రెడ్డి. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి విచారణను ఎదుర్కొంటున్నారు ఆయన. ఈడీ ఆఫీస్ దగ్గర మీడియాతో మాట్లాడుతూ.. అయ్యప్ప దీక్షలో ఉన్నందున 31 వరకు విచారణ లేకుండా చూడాలని కోరానని.. కానీ, ఈడీ ఒప్పుకోలేదని తెలిపారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లతో విచారణకు హాజరయ్యారు రోహిత్ రెడ్డి.