Advertisement
చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కేటాయించాలనే లక్ష్యంతో మహిళా బిల్లు ఆమోదం కోసం పోరాటానికి సిద్ధమయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. దీనికోసం ఒక రోజు దీక్షకు ప్లాన్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఈ కార్యక్రమం 10న జరగనుంది. అయితే.. దీనికి సంబంధించిన వివరాల్ని కవిత మీడియాకు వివరిస్తున్న సమయంలో దీక్షకు పర్మిషన్ ఇవ్వలేమని.. వేదిక మార్చుకోవాలని పోలీసుల నుంచి మెసేజ్ వచ్చింది. దీంతో షాకైన బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులతో సంప్రదింపులు జరిపారు.
Advertisement
కవిత దీక్ష చేయాలనుకున్న ప్రదేశంలోనే బీజేపీ లిక్కర్ స్కాం ను వ్యతిరేకిస్తూ ధర్నా చేపడతామని పోలీసులను రిక్వెస్ట్ చేసింది. దీంతో ఖాకీలు.. స్థలాన్ని సగం సగం పంచారు. కానీ, దీనికి కవిత ఒప్పుకోలేదు. తమ ధర్నాకు విపక్ష పార్టీల్లోని నేతలు వస్తున్నారని.. ఇంకా చాలామంది పాల్గొంటరని.. అదే ప్రదేశంలో దీక్ష నిర్వహించి తీరతామని స్పష్టం చేశారు. అయితే.. అనూహ్యంగా బీజేపీ నేతలు ధర్నా వేదికను దీన్ దయాల్ మార్గ్ కు మార్చుకున్నారు. దీంతో కవిత ధర్నాకు అడ్డంకులు తొలగిపోయాయి.
Advertisement
27 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేస్తున్నారని.. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆమోదం రావడం లేదని అంటున్నారు కవిత. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. 2014, 2018 ఎన్నికల సమయంలో ఈ బిల్లుపై బీజేపీ హామీ ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. 300కు పైగా ఎంపీ స్థానాలు గెలిచినా ఆమోదించలేదని మండిపడుతున్నారు. మహిళా బిల్లుపై నోరు విప్పకుండా.. బిల్లు అంశాన్ని కోల్డ్ స్టోరేజీలో పెట్టారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిరసనగా తాము దీక్ష చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
మరోవైపు ఢిల్లీలోనే కాకుండా.. హైదరాబాద్ లోనూ బీజేపీ పోటాపోటీ దీక్షకు దిగుతోంది. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్, డీకే అరుణతో పాటు పార్టీ ముఖ్య నేతలు ఇందులో పాల్గొనబోతున్నారు. రాష్ట్రంలో పెరిగిన బెల్ట్ షాపులకు నిరసనగా మహిళ గోస-బీజేపీ భరోసా పేరుతో ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు.