Advertisement
సాయంత్రం 6 దాటినా తనను ఈడీ ఆఫీస్ లోనే ఉంచారని మొదటిసారి విచారణ సందర్భంగా కవిత మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా విచారణ జరుగుతోందని సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. దీనిపై విచారణ 24న జరగనుంది. ఈలోపే మరోమారు ఈడీ విచారణకు హాజరయ్యారు కవిత. కానీ, ఎలాంటి మార్పు లేదు కదా.. గత విచారణ కంటే ఓ గంట ఎగస్ట్రా ఉంచి పంపారు ఈడీ అధికారులు.
Advertisement
ఉదయం 11 గంటలకు విచారణ అయితే.. సోమవారం ఉదయం 10.25 గంటలకే ఈడీ ఆఫీస్ లోకి వెళ్లారు కవిత. ఆమె వెంట తన భర్త, కొందరు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. లోపలికి వెళ్తూ హగ్ ఇచ్చి ధైర్యం చెప్పారు కవిత భర్త. లోపలికి వెళ్లాక ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఢిల్లీ, హైదరాబాద్ మీటింగులకు సంబంధించిన వివరాలపై ఆరా తీసింది. పీఎంఎల్‌ఏ సెక్షన్ 50 కింద ఈడీ అధికారులు కవితను విచారించారు.
Advertisement
ఢిల్లీ, హైదరాబాద్ సమావేశాల్లో చర్చించిన అంశాలపై అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. మనీలాండరింగ్ కేసులో అనుమానితురాలిగా కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సౌత్ గ్రూప్ నుంచి ఆమె కీలక వ్యక్తిగా ఈడీ పేర్కొంది. బ్యాంక్ స్టేట్ మెంట్ సహా మిగిలిన డాక్యుమెంట్లను కవిత ఇప్పటికే వారికి అందించారు. సిసోడియా, పిళ్లైతో కలిసి ఈసారి కవిత విచారణ కొనసాగినట్టు తెలుస్తోంది. అయితే.. కవిత విచారణ కొనసాగుతుండగానే సాయంత్రం తెలంగాణ అదనపు ఏజీ ఈడీ కార్యాలయం వద్దకు చేరుకోవడం చర్చనీయాంశమైంది.
సాయంత్రం 6 గంటలకే వాహనాలు సిద్ధం చేశారు కవిత అనుచరులు. అలాగే, మహిళా పోలీసులు, బలగాలను భారీగా మోహరించారు. దీంతో ఏం జరుగుగుందో అనే టెన్షన్ ఆ పరిసరాల్లో కనిపించింది. సాయంత్రం 6 గంటలు దాటితే మహిళను విచారించకూడదని.. అది చట్ట విరుద్ధమని కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే.. రెండోసారి విచారణలో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. రాత్రి 9.10 గంటల దాకా కవితను విచారించారు అధికారులు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చాక విక్టరీ సింబల్ చూపిస్తూ కనిపించారు కవిత. తనకు సపోర్ట్ గా అక్కడకు వచ్చిన వారికి అభివాదం చేశారు.