Advertisement
మొయినాబాద్ ఫాంహౌస్ చుట్టూ తెలంగాణ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇన్నాళ్లూ మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో సైలెంట్ గా ఉన్న కేసీఆర్.. ప్రెస్ మీట్ పెట్టి కేంద్రాన్ని ఓ ఆటాడుకున్నారు. అయితే.. బీజేపీ నేతలు కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతూ కేసీఆర్ కు కౌంటర్ ఇస్తున్నారు. ఈ పంచాయితీ నడుస్తుండగా.. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించి వేసిన పిటిషన్లపై వాదనలు జరిగాయి.
Advertisement
ఈ వహారంలో గత నెల చివరిలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను యధాతథంగా కొనసాగించాలని స్పష్టం చేసింది హైకోర్టు. తదుపరి విచారణను 7వ తేదీకి వాయిదా వేసింది. బీజేపీతోపాటు నిందితుడు నందు భార్య చిత్రలేఖ, ఇతర పిటిషన్లను కలిపి హైకోర్టు సోమవారం విచారించనుంది. అప్పటివరకూ ఆడియోలు, వీడియోలు బయటకు రావొద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే బయటకు వచ్చినవాటిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది నుంచి ఆరా తీసింది.
Advertisement
కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ బీజేపీ వేసిన పిటిషన్ పై వాదనలు విన్న న్యాయస్థానం.. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేంత వరకు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు దర్యాప్తుపై స్టే విధించింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు గురువారం కౌంటర్ దాఖలు చేశారు. ఆ కౌంటర్ సుదీర్ఘంగా ఉన్నందున వాదనకు సమయమివ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా సోమవారానికి విచారణ వాయిదా వేసింది న్యాయస్థానం.
మరోవైపు నిందితుల పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ గవాయి నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణ చేసింది. ఫాంహౌజ్ కేసులో హైకోర్టు భిన్నమైన తీర్పులు ఎలా ఇస్తుందని సుప్రీం ప్రశ్నించింది. బెయిల్ పిటిషన్ వేసి ఉంటే ఈరోజే విడుదల చేసేవాళ్లమని కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులో మెరిట్ ఆధారంగా విచారణ జరపాలని ట్రయల్ కోర్టుకు సూచనలు చేసింది సుప్రీం. కేసు విచారణ సందర్భంగా నిందితుల తరఫు లాయర్ తమ వాదనలు వినిపించారు. టీఆర్ఎస్,బీజేపీ మధ్య జరుగుతున్న యుద్ధంతో తాను బలవుతున్నామని చెప్పుకొచ్చారు. తదుపరి విచారణను సుప్రీం 7వ తేదీకి వాయిదా వేసింది.