Advertisement
మొయినాబాద్ ఫాంహౌస్ వ్యవహారం.. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. బీజేపీ కుట్ర అని టీఆర్ఎస్.. లేదు కేసీఆర్ డ్రామా అని బీజేపీ విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఇష్యూకి సంబంధించి న్యాయస్థానాల్లో వేసిన పిటిషన్లపై విచారణలు కొనసాగుతున్నాయి. సోమవారం అటు సుప్రీంకోర్టులో, ఇటు హైకోర్టులో వాదనలు జరిగాయి.
Advertisement
సుప్రీంకోర్టులో విచారణ
తెలంగాణ హైకోర్టు రిమాండ్ విధించడంపై నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నంద కుమార్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అయితే.. ఈ పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయాలకు కోర్టులను వేదికలుగా చేసుకుంటున్నారని మండిపడింది. కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లు హైకోర్టులో ఉన్నాయని.. ప్రభుత్వం తరఫున న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
Advertisement
ఇంతకుముందు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ బివి నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. హైకోర్టుకు పలు ప్రశ్నలు సంధించింది. దర్యాప్తుపై స్టే విధించాలని ఓ రాజకీయ పార్టీ ఎందుకు పిటిషన్ దాఖలు చేసిందని.. అలాంటి పిటిషన్ ను విచారణకు ఎలా స్వీకరించిందని ప్రశ్నించింది. పిటిషన్ దాఖలుకు ఆ పార్టీకి ఉన్న అర్హత ఏమిటని హైకోర్టు ప్రశ్నించాల్సిందని అభిప్రాయపడింది.
హైకోర్టులో విచారణ
ఈ కేసును సీబీఐకి అప్పగించాలని దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపింది తెలంగాణ హైకోర్టు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. పిటిషనర్ కు ఎమ్మెల్యేల కొనుగోలుతో ఎలాంటి సంబంధం లేదన్నారు. పైగా కేసు ప్రారంభ దశలోనే ఉందని వివరించారు. ఇటు బీజేపీ వైపు నుంచి కర్ణాటక మాజీ ఏజీ వాదనలు వినిపించారు. ఇదంతా టీఆర్‌ఎస్ పక్కా ప్లాన్ తో చేసిందన్నారు. పోలీసుల తీరు సరిగా లేదని అనుమానం వ్యక్తం చేశారు. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.