Advertisement
తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలన అంతా మోసమని విమర్శించారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్గొండలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తర్వలో నాలుగు జిల్లాల్లో తాను యాత్ర చేపడుతున్నట్టు తెలిపారు. బైక్ యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నామని.. తొమ్మిదేళ్లలో కేసీఆర్ ఏం చేశారని ప్రజలను అడుగుతామని చెప్పారు. ‘‘మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా? ఉద్యోగాలు వచ్చాయా? ఎన్ని ఇళ్లు కట్టారు? ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించారు?’’ కేసీఆర్ హామీలు ఎన్ని అమలయ్యాయో ప్రజలనే అడిగి తెలుసుకుంటామన్నారు. ఏఎంఆర్పీ కాలువ సొరంగం తీసి.. 500 కోట్లు ఖర్చు పెడితే బంగారుమయం అవుతుందని.. కానీ, చేయడం లేదని మండిపడ్డారు కోమటిరెడ్డి.
Advertisement
ఈసారి ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ లో జరగాల్సి ఉందని.. అయితే.. కేసీఆర్ అప్పటిదాకా ఆగే అవకాశం లేదన్నారు. ఎందుకంటే, ఆ తర్వాత కొన్ని నెలలకే సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధిస్తారేమో అని ముందే కేసీఆర్ ఎన్నికలు వెళ్లొచ్చని అంచనా వేశారు. ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్ లో ఎలాంటి విభేదాలు లేవన్న ఎంపీ.. బీఆర్ఎస్ లోనే గందరగోళం నెలకొందని విమర్శించారు. ఇక తనపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పాలన.. పైన పటారం లోన లొటారంలా ఉంటుందని ఆరోపించారు.
Advertisement
బడ్జెట్ అంతా బోగస్ అని విమర్శించిన కోమటిరెడ్డి.. కేసీఆర్ గత బడ్జెట్ నే పూర్తిగా ఖర్చు పెట్టలేదన్నారు. అప్పులు వచ్చే పరిస్థితి లేదని కేటాయింపులు జీతాలకు, వడ్డీలకే సరిపోతున్నాయని చెప్పారు. 5 లక్షల కోట్ల అప్పు చేశారని.. దానికి వడ్డీ కట్టడమే సరిపోతోందని విమర్శించారు. జగదీష్ రెడ్డి సొంత ఊరులో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదన్న ఎంపీ.. ఈ విషయం తెలిసి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేద్దామని చూస్తే బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. తాను ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని.. ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్టు వివరించారు. స్థానిక విద్యాసంస్థల్లో సరైన వసతులు లేకపోవడంతో సొంత ఖర్చుతో వాటిని సమకూర్చుతున్నానని చెప్పారు.
మహిళా జూనియర్ కాలేజీలో విద్యార్థులు ఒకటే బాత్రూంతో ఇబ్బంది పడుతుంటే కొత్తవి కట్టించామని తెలిపారు. ఆ అమ్మాయిల దగ్గరకి వెళ్తే తాను ఏం చేశానో చెప్తారని తనపై విమర్శలు చేసేవారికి చురకలంటించారు. హైదరాబాద్, విజయవాడ రోడ్డు విస్తరణపై కేంద్రంతో చర్చలు జరిపానని.. అక్కడ తమ ప్రభుత్వం లేకపోయినా మాట్లాడి రోడ్లను అభివృద్ధి చేయించానన్నారు. తనపై విమర్శలు చేసేవారికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్న వెంకట్ రెడ్డి.. రాజశేఖర్ రెడ్డి హయాంలో బ్రిడ్జి తెప్పించానని గుర్తు చేశారు. అలాగే, మహాత్మాగాంధీ యూనివర్సిటీ తీసుకొచ్చానన్నారు. ఫ్లోరైడ్ నీళ్లతో బాధ పడుతున్నాం.. గ్రౌండ్ వాటర్ లేదని సొరంగం కోసం ఆనాడు శంకుస్థాపన చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. వంద కోట్ల రోడ్డు వేసి తానేం చేశానని అడుగుతారా? సిగ్గుందా? అంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. శివాజీ నగర్ చౌరస్తాలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేశామని.. కొత్త కాలనీలు తప్ప మిగిలిన అన్నింటికీ రోడ్లు వేయించింది తాను కాదా అని ప్రశ్నించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.