Advertisement
రాహుల్ గాంధీపై అనర్హత ప్రకటించిన మార్చి 23ని చీకటి రోజుగా అభివర్ణించారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో రాహుల్ గాంధీకి మద్దతుగా ధర్నా చేశారు. ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అతిపెద్ద ఈ ప్రజాస్వామ్య దేశంలో జాతీయ పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన వ్యక్తిపై కుట్రలు తగదని అన్నారు కోమటిరెడ్డి. తామంతా ఆయన వెంటే ఉంటామని.. అవసరమైతే పదవులకు రాజీనామాకైనా సిద్ధమని స్పష్టం చేశారు.
Advertisement
దేశం కోసం రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ, నాయనమ్మ ఇందిరాగాంధీ ప్రాణాలు విడిచారని గుర్తు చేశారు వెంకట్ రెడ్డి. దేశం ఒక్క తాటిపై ఉండాలని నిరంతరం ఆలోచించే వ్యక్తి రాహుల్ గాంధీ అని.. భారత్ జోడో యాత్ర పేరుతో కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ఉండాలని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేశారని తెలిపారు. మైనస్ డిగ్రీల చలిలో కూడా టీషర్ట్ పైనే జోడో యాత్ర చేశారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఎప్పుడో అన్న ఒక మాట పట్టుకుని కుట్రలు చేయడం కరెక్ట్ కాదన్న ఆయన.. కోర్టు తీర్పు వచ్చాక.. బెయిల్ ఇచ్చి 30 రోజుల సమయం ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ, 24 గంటలు గడవకముందే అనర్హత ప్రకటించడం దుర్మార్గమని మండిపడ్డారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Advertisement
ఎన్నికలు వచ్చినప్పుడు కొట్లాడాలి.. అంతేగానీ ఇలా కుట్రలు చేయకూడదన్నారు ఎంపీ. జోడోయాత్రలో రాహుల్ గాంధీ ఏనాడైనా రాజకీయాల గురించి మాట్లాడారా? ప్రజలంతా ఐక్యంగా ఉండాలని చెప్పారని వివరించారు. కాంగ్రెస్ పార్టీని, గాంధీ ఫ్యామిలీని దెబ్బతీయాలని మోడీ చేస్తున్న ఈ చర్యలను ఖండిస్తున్నామని.. ప్రభుత్వ నిరంకుశ చర్యలపై వీధిపోరాటాలకైనా సిద్ధమని స్పష్టం చేశారు. దేశం కోసం తన గొంతు విప్పుతూనే ఉంటానని ఆయన అన్న మాటలు.. కాంగ్రెస్ శ్రేణుల గుండెలకు హత్తుకుపోయాయని అన్నారు.
గాంధీ ఫ్యామిలీకి పదవులు లెక్కకాదన్న కోమటిరెడ్డి.. ప్రధాని అవ్వాలనుకుంటే ఎప్పుడో అయ్యేవాళ్లని తెలిపారు. కానీ, ఆనాడు మన్మోహన్ ను పీఎం చేశారని గుర్తు చేశారు. వాళ్ల వల్లే ఈనాడు పేదలు రెండు పూటలా భోజనం చేస్తున్నారని.. ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిన ఘనత వారిదేనని కొనియాడారు. రాహుల్ గాంధీపై బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా తమ పోరాటం ఆగదని.. ఆయన వెంటే ఉండి కేంద్రం చర్యలను తిప్పికొడతామన్నారు వెంకట్ రెడ్డి.