Advertisement
తెలంగాణ మీడియాను ఒక్కసారిగా తనవైపు తిప్పేశారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. హైదరాబాద్-విజయవాడ హైవే నిర్మాణంపై కేంద్ర రోడ్లు, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి చర్చించారు. గతంలో ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ వరకు జీఎంఆర్ రోడ్డు ఆరు లేన్లు చేయాలని కేంద్రమంత్రిని కోరగా.. త్వరలో ప్రారంభం అవుతాయని గడ్కరీ తెలిపారు. విజయవాడ, హైదరాబాద్ మధ్య ట్రాఫిక్ పెరిగిందని.. ప్రమాదాలు పెరిగాయని కేంద్రమంత్రికి వివరించారు ఎంపీ.
Advertisement
అలాగే,రీజనల్ రింగ్ రోడ్డు గురించి కూడా గడ్కరీతో వెంకట్ రెడ్డి చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 500 కోట్లు ఇవ్వలేదని.. భువనగిరి పరిధిలోని రీజనల్ రింగ్ రోడ్డుకి భూసేకరణ సమస్యల పరిష్కారం, రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇస్తే త్వరలో రీజనల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభం అవుతాయని కేంద్రమంత్రితో భేటీ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాన్ని రాజేశాయి.
Advertisement
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తిస్థాయి మెజార్టీ రాదని అన్నారు కోమటిరెడ్డి. రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి 60 సీట్లు రావని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తో కేసీఆర్ కలవక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. అందరం కష్టపడితే 40-50 సీట్లు వస్తాయని.. కాంగ్రెస్ అధికారంలో ఉండటం మాత్రం ఖాయమని తెలిపారు. పార్టీలోని ఏ ఒక్కరితో కాంగ్రెస్ కు అన్ని సీట్లు రావన్నారు. తాను గెలిపిస్తా అంటే.. మిగిలినవారు ఇంట్లోనే ఉంటారని వ్యాఖ్యానించారు.
కోమటిరెడ్డి వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. సొంత పార్టీ నేతలే అభ్యంతరం తెలిపారు. దీంతో ఆయన వివరణ ఇచ్చారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ చెప్పినట్లుగానే ఏ పార్టీతో తమకు పొత్తు ఉండదని స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీ మాటలకే తాము కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చిన కోమటిరెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. తాను గందరగోళంలో ఏమి లేనని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సర్వేల ఆధారంగానే హంగ్ వస్తుందని చెప్పినట్లు వివరించారు. తానేమి తప్పుగా మాట్లాడలేదని, తనపై చిన్నపిల్లలు కూడా విమర్శలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.