Advertisement
పీసీసీ కమిటీలను తాను పట్టించుకోనన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రేతో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. ఇంఛార్జ్ పదవి చేపట్టాక తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ పరిస్థితులపై థాక్రేతో చర్చించారు కోమటిరెడ్డి. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Advertisement
పీసీసీ కమిటీలో ఆరేడు సార్లు ఓడిపోయిన వాళ్లతో తాను కూర్చోవాలా అని ప్రశ్నించారు. పార్టీని ఎలా ముందుకు తీసుకుపోవాలో థాక్రేతో చర్చలు జరిపినట్లు తెలిపారు. సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డి ఎందుకు థాక్రేను కలవలేదో వాళ్లనే అడగాలన్న ఆయన.. తన పర్సనల్ మీటింగ్ లో జరిగిన విషయాలు మీడియాకు చెప్పబోనన్నారు. తనకిచ్చిన షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడేశారని తెలిపారు.
Advertisement
నోటీసులు ఏమీ లేవని, తన పని తాను చేసుకోవాలని మల్లికార్జున ఖర్గేనే తనతో చెప్పారని వివరించారు కోమటిరెడ్డి. మాణిక్ రావు థాక్రే చాలా మంచివారని ఆయన గురించి తనకు, తన గురించి ఆయనకు బాగా తెలుసన్నారు. నియోజకవర్గం పనుల్లో బీజీగా ఉండటం వల్లే బుధవారం గాంధీ భవన్ కు రాలేదని తెలిపారు. గంట పాటు సాగిన భేటీలో భవిష్యత్ లో పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై తాను కొన్ని అభిప్రాయాలను థాక్రేతో పంచుకున్నానని చెప్పారు.
పార్టీ కోసం మొదటి నుంచి పని చేసిన వారిని పట్టించుకోవడం లేదని, పీసీసీ కమిటీలను ప్రక్షాళన చేయాలని థాక్రేను వెంకట్ రెడ్డి కోరినట్టు తెలుస్తోంది. పీసీసీ కమిటీల విషయంలో జరిగిన గొడవలు.. సీనియర్ల అలక.. ఇలా అనేక విషాలపై ఇద్దరూ మాట్లాడుకున్నట్లు సమాచారం.