Advertisement
హైదరాబాద్ నగర శివారులో ఎన్నో కంపెనీలు ఉన్నాయి. వాటివల్ల చాలా గ్రామాలు ఇబ్బందులు పడుతున్నాయి. జనావాసాలకు దగ్గరగా కొన్ని కంపెనీలు ఉండడంతో గాలి, నీటి కాలుష్యంతో జనం అవస్థలు పడుతున్నారు. ఇంకోవైపు భూములు తీసుకుని సరైన పరిహారం అందక అవస్థలు పడుతున్నారు రైతులు. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు సాగుతున్నాయి. అలా మేడిపల్లి ఫార్మా సిటీని వ్యతిరేకిస్తూ.. పాదయాత్రకు పూనుకున్నారు బాధిత రైతులు.
Advertisement
ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యాత్ర ఇబ్రహీంపట్నం వరకు జరిగింది. పాదయాత్రలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. రైతులకు సంఘీభావం తెలిపారు. వారితో కలిసి కొంత దూరం నడిచారు. కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజల భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి కోట్ల రూపాయలకు ఫార్మా కంపెనీలకు అమ్ముకుంటోందని ఆరోపించారు.
Advertisement
గతంలో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసిన చోట కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు వెంకట్ రెడ్డి. ఇప్పుడు ఒకే చోట వందల కంపెనీలు ఏర్పాటు చేస్తే.. హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరూ ఉండలేరని తెలిపారు. పార్టీలకతీతంగా దీనిపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
ఇటు ఫార్మాసిటీ వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కాంగ్రెస్ నేత కోదండరెడ్డి, రైతు సంఘం జాతీయ నాయకులు జంగారెడ్డి కూడా డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నంలో రైతులకు మద్దతు తెలిపారు నేతలు. గ్రామ సభలు పెట్టకుండా, ప్రజలు, రైతుల అభిప్రాయాలను తీసుకోకుండా బెదిరించి రైతుల దగ్గర బలవంతపు భూసేకరణ చేశారని మండిపడ్డారు. 7 ఏండ్ల నుండి ఇంకా రైతులకు నష్టపరిహారం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.