Advertisement
ఓవైపు అకాల వర్షాలు.. మరోవైపు ఇసుక మాఫియా అరాచకాలు.. వెరసి నల్గొండ జిల్లాలో ప్రత్యేకించి భువనగిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో రహదారులు నరకాన్ని తలపిస్తున్నాయన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ మేరకు రోడ్ల దుస్థితిని వివరిస్తూ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. గతుకుల రోడ్లు ప్రతిరోజూ కనీసం ఒకటి, రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయని.. నాలుగు రోజుల క్రితం ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకొందని వివరించారు. గతుకుల రోడ్లలో ఓ హార్వెస్టర్ ఢీకొని 32 ఏళ్ల పైళ్ల ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తి చనిపోయాడని ఆవేదన వ్యాక్తం చేశారు. అతని ఇద్దరు చిన్నారులు, భార్య రోడ్డున పడ్డారని లేఖలో వివరించారు. తానేమో ఒక ఎంపీగా, బాధ్యతతో నిత్యం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూ జనం కోసం హైవేలు వేయిస్తుంటే, ప్రభుత్వం మాత్రం రోడ్ల విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
Advertisement
‘‘భారీ వర్షాల మాట అటుంచితే, కనీసం ఇసుక మాఫియాను అడ్డుకున్నా నల్గొండ జిల్లాలో రోజుకు రెండు ప్రాణాలు కాపాడే అవకాశం వుంది. నిత్యం అక్రమంగా 150 టన్నుల ఓవర్ లోడ్ తో, వందల లారీలు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే అడ్డుకోవాల్సిన యంత్రాంగం, అమ్ముడుపోయిందా! లేదా చేష్టలుడిగి పోయిందా! అర్థం కావడం లేదు. అలాంటి లారీల వల్ల నా ప్రజల ప్రాణాలు పోతుంటే స్థానిక ఎంపీగా గుండె తరుక్కుపోతోంది. నాయకుడిగా కంటే, మానవత్వం ఉన్న మనిషిగా ఆయా కుటుంబాలను ఓదార్చటం, వ్యక్తిగతంగా సాయం చేసి ఆదుకోవటం తప్ప ఏం చేయలేకపోతున్నందుకు బాధగా వుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే నా వంతుగా పైళ్ల ప్రశాంత్ రెడ్డి కుటుంబానికి తక్షణ సాయంగా లక్ష రూపాయలు అందించాను’’ అని లేఖలో పేర్కొన్నారు కోమటిరెడ్డి.
Advertisement
ఒక రాష్ట్ర సీఎంగా కేసీఆర్ స్పందించి, రోడ్ల మరమ్మతుల కోసం కనీసం వెయ్యి కోట్లు మంజూరు చేస్తే భవిష్యత్తులో మరిన్ని ప్రాణాలు పోకుండా కాపాడొచ్ని అన్నారు. ‘‘రాష్ట్రంలో సగటున ప్రతీ నియోజకవర్గంలో 25 కిలోమీటర్ల మేర రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాల్సిన అవసరముంది. మొత్తంగా 2,975 కిలోమీటర్ల మేర పనులు జరగాలని అంచనా. వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి చాలాచోట్ల కల్వర్టులు, కాజ్ వేలు దెబ్బతిన్నాయి. వాటికి మరమ్మతులు చేయడం, కొత్తగా నిర్మించడం, అవసరమైన చోట బ్రిడ్జీల నిర్మాణం చేపట్టాలి. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి నుంచి ఆత్మకూర్(ఎం) మండలం రాయిపల్లికి వెళ్లే రోడ్డు మరీ అధ్వాన్నంగా ఉంది. సుమారు 5 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డుపై వెళ్లే వాహనదారులకు నరకం కనిపిస్తోంది. వాహనాల రాకపోకలతో విపరీతంగా దుమ్ము కనిపిస్తోంది. కొంత దూరంలో ఏముందో కూడా కనబడని పరిస్థితి నెలకొంది. ప్రయాణికులతో పాటు రోడ్డుకు సమీపంలోని ఇళ్లలో ఉంటున్నవారు కూడా దుమ్ముతో అనారోగ్యం పాలవుతున్నారు’’ అని అన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
భారీ వర్షాలతో రోడ్డు గుంతలు పడటంతో ప్రయాణికులు ప్రమాదాల బారినపడుతున్నారని.. వాహనాలు కూడా దెబ్బతింటున్నాయని వివరించారు. ‘‘మోత్కూరు- రాయగిరి రోడ్డు పనులు మూడున్నర ఏళ్లుగా చేస్తున్నారు. మీరు తిరిగే రహదారులకు వందల కోట్లు.. ప్రజలు తిరిగే రోడ్లపై నిత్యం పాట్లు. ఇదే వాస్తవ పరిస్థితి’’ అని మండిపడ్డారు. ప్రతీ నియోజకవర్గంలో రోడ్ల తక్షణ మరమ్మతుల కోసం కనీసం రూ.6 కోట్లు కావాలని అధికారులు చెప్తున్నారన్నారు. అంటే రాష్ట్రవ్యాప్తంగా రూ.714 కోట్ల వరకు అసవరముందని.. కుంగిన, కూలిన బ్రిడ్జీలు, కల్వర్టుల కోసం ప్రత్యేకంగా నిధులు కావాలని చెప్పారు. వెంటనే రహదారుల మరమ్మతులపై దృష్టి సారించాలన్నారు. అధికారుల అంచనాలకు తగ్గట్టు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని.. లేకపోతే ప్రమాదాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ప్రజల అవస్థలను గుర్తించి ప్రభుత్వం నిధుల విడుదలపై దృష్టి సారించాలని ఆశిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. చివరిగా.. ‘‘ఒక ఎంపీగా నా వంతు కర్తవ్యం నేను నిర్వర్తిస్తున్నా. ఒక సీఎంగా ప్రజల ప్రాణాలు కాపాడటానికి మీ బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. ఇకనైనా స్పందించండి. మరిన్ని కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడండి’’ అని ముగించారు.