Advertisement
ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్టయిలే వేరు. ఏమాత్రం మొహమాటం లేకుండా.. ఎవరిపైనైనా మాట్లాడడంలో ఆయన దిట్ట. అధిష్టానంతో ఉన్న సత్సంబంధాలు, తన నియోజకవర్గంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు పార్టీలో ఆయన్ను ప్రత్యేకంగా ఉంచుతుంది. తాజాగా రాయ్ పూర్ వెళ్లిన కోమటిరెడ్డి అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.
Advertisement
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పొత్తులు అవసరం లేదని అన్నారు. జాతీయ స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని ఏఐసీసీ చీఫ్ ఖర్గేనే చెప్పారని గుర్తుచేశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై చర్చించేందుకు ప్రియాంక గాంధీని అపాయింట్మెంట్ కోరానని త్వరలోనే ఢిల్లీలో భేటీ అవుతానని తెలిపారు.
Advertisement
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల విషయంలో సీఎం కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదని, గత ఎన్నికల లాగా కాకుండా ఈసారి టికెట్ల కేటాయింపు త్వరగా జరిగేలా చూడాలని అధిష్టానాన్ని కోరతానని తెలిపారు. ముఖ్యంగా ఆశావాహులు ఎక్కువగా ఉన్నచోట కొంత ఆలస్యం జరిగినా.. పట్టు ఉన్న చోట్ల మాత్రం అభ్యర్థులను వెంటనే ప్రకటించాలని, ఈ విషయాన్ని ప్రియాంక గాంధీ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.
గతంలో పీసీసీ పదవి ఇవ్వలేకపోయిన సందర్భంగా తనకు న్యాయం చేయలేకపోయామని, భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని చెప్పారు వెంకట్ రెడ్డి. సీడబ్ల్యూసీలో చోటు కల్పిస్తే మరింత ఉత్సాహంగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని.. లేకుంటే, తన పరిధిలోని 20 అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితం అవుతానని వ్యాఖ్యానించారు.