Advertisement
మద్యపాన నిషేధం చేసిన తరువాత ఓట్లు అడగడానికి వస్తానని చెప్పిన జగన్ రెడ్డి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని జనం ముందుకు వస్తారని అడిగారు టీడీపీ నేత నారా లోకేష్. పార్టీ శ్రేణులు, జనసందోహం నడుమ మూడోరోజు పాదయాత్రను ముగించారు. ఇందులో భాగంగా మాట్లాడిన లోకేష్.. మందుబాబులను తాకట్టు పెట్టిన ఘన చరిత్ర జగన్ రెడ్డిదని విమర్శించారు. ఆయన సతీమణి భారతి రెడ్డి.. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మ ఒడి అన్నారు.. ఇప్పుడు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. అరకొరగా ఇచ్చే అమ్మఒడి కూడా ఏడాది ఎగ్గొట్టారని ఆరోపించారు.
Advertisement
45 సంవత్సరాలకే మహిళలకు పెన్షన్ అని చెప్పిన జగన్ ఇస్తున్నారా? అని అడిగారు లోకేష్. జగన్ అధికారంలోకి రాగానే వ్యవసాయ సబ్సిడీలు ఎగ్గొట్టారని ఆరోపించారు. రైతులు క్రాప్ హాలీడే ప్రకటించే పరిస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు. ఏపీ చరిత్రలో ఇది ఎన్నడూ ఇది జరగలేదని.. మోటార్లకు మీటర్లు పెడుతూ రైతులకు ఉరితాళ్లు బిగిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం రాగానే రైతులకు సబ్సిడీలు, సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. చిన్న, సన్నకారు రైతులకు సబ్సిడీ లోన్ లు కూడా అందిస్తామని తెలిపారు.
Advertisement
గతంలో టీడీపీ అందించిన ప్రతి పథకాలను మళ్లీ తీసుకొస్తామన్నారు లోకేష్. చిన్న, సన్నకారు రైతులకు లోన్ లు రావడం చాలా కష్టతరమైందని చెప్పారు. కోర్టులో చోరీ చేసిన వ్యక్తి వ్యవసాయశాఖ మంత్రి కాకాణి అని విమర్శించారు. ఇలాంటి దొంగలకు, దొంగ ప్రభుత్వానికి రైతుల కష్టాలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు. రైతు భరోసా కేంద్రాలంటూ జాదూ మంత్రాలతో మోసం చేస్తున్నారని.. గత పాలనలో ఏపీని రైతు రాజ్యం అనేవారని, ఇప్పుడు రైతేలేని రాజ్యంగా జగన్ రెడ్డి మార్చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
కర్ణాటకలో లీటర్ డీజిల్ రూ.88, పెట్రోల్ రూ.102 ఉంటే.. ఏపీలో లీటర్ డీజిల్ రూ.99.27, పెట్రోల్ రూ.111.50 ఉందన్నారు లోకేష్. పెట్రోల్, డీజిల్ పై పన్ను బాదుడులో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని చురకలంటించారు. అలాగే నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజలపై భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రకరకాల పన్నులతో ప్రజలను జగన్ రెడ్డి దోచుకుంటున్నారని ఆరోపించారు. ఏపీలో పెట్రోల్ ధరలపై జగన్ రెడ్డి బాదుడే బాదుడని సెటైర్లు వేశారు లోకేష్.