Advertisement
సంచలనం రేపిన నవీన్ మర్డర్ కేసులో అనేక డౌట్స్ ఉండిపోయాయి. నిందితుడు హరిహరకృష్ణ ఒక్కడే ఇంత క్రూరంగా హత్య చేశాడా? అతనికి ఇంకెవరైనా సాయం చేశారా? ఇలా ఎన్నో అనుమానాలు తెరపైకి వచ్చాయి. హరిహర తండ్రి కూడా కొన్ని డౌట్స్ ను వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలో నిందితుడు ఏదో దాస్తున్నానడే అనుమానంతో.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కొన్ని సంచలన విషయాలు తెలిశాయి.
కేసులో మొదట్నుంచి వినిపిస్తున్న యువతిని.. అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు అరెస్టు చేయడం సంచలనం రేపింది. ఆమె కోసమే హరిహర కృష్ణ, నవీన్ ను హతమార్చినట్టు పోలీసులు తెలిపారు. కస్టడీలో నిందితుడు చెప్పిన వివరాల ఆధారంగా యువతిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. నవీన్ ని హత్య చేసి ఆ ఫోటోలను హరిహర కృష్ణ ఆమెకు పంపినట్టు వెల్లడించారు. మరో నిందితుడు హసన్ ను కూడా అరెస్టు చేసినట్టు ఎల్బీ నగర్ డీసీపీ సాయిశ్రీ చెప్పారు.
Advertisement
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. గత నెల 17వ తేదీన నవీన్ ను చంపాడు హరిహర. ఆ తర్వాత తల, గుండె, చేతి వేళ్లు, మర్మాంగాలను శరీరం నుంచి వేరు చేసి వాటిని సంచిలో వేసుకొని ద్విచక్ర వాహనంపై బ్రాహ్మణపల్లిలోని హసన్ ఇంటికి వెళ్లాడు. ఇదంతా హసన్ కు చెప్పాడు. తర్వాత ఇద్దరూ కలిసి శరీర అవయవాలను మన్నెగూడ పరిసరాల్లో పడేశారు. ఆ తర్వాత హసన్ ఇంటికి చేరుకొని దుస్తులను మార్చుకొని రాత్రి అక్కడే ఉండి.. 18న ఉదయం బీఎన్ రెడ్డి నగర్ లో ఉండే యువతి వద్దకు వెళ్లాడు హరిహర. ఆమెకు నవీన్ ను హత్య చేసిన విషయం చెప్పి.. ఖర్చుల కోసం 1500 రూపాయలు తీసుకొని వెళ్లాడు. తర్వాత ఫోన్ లో యువతితో, హసన్ తో మాట్లాడుతూ వచ్చాడు.
Advertisement
20న సాయంత్రం మరోసారి యువతి వద్దకు వెళ్లి ఆమెను హత్య చేసిన ప్రాంతానికి తీసుకెళ్లాడు. దూరం నుంచి నవీన్ మృతదేహాన్ని చూపించాడు. ఇద్దరూ కలిసి రెస్టారెంట్ కు వెళ్లి బిర్యానీ తిన్నారు. 21న పారిపోయిన హరిహర 23న వరంగల్ లో తండ్రి వద్దకు చేరుకున్నాడు. అప్పటికే పోలీసులు గాలిస్తున్నట్లు తండ్రికి తెలియడంతో.. వెంటనే లొంగి పోవాల్సిందిగా సూచించాడు. 24న హరిహర కృష్ణ హైదరాబాద్ కు వచ్చి హసన్ వద్దకు వెళ్లాడు. ఆధారాలు చెరిపివేసేందుకు నవీన్ మృతదేహాన్ని తగులబెట్టాలని నిర్ణయించుకున్నాడు. మన్నెగూడలో పడేసిన నవీన్ తల, ఇతర అవయవాలను సంచిలో తీసుకొచ్చాడు హసన్. వాటిని హరిహరకు ఇవ్వగా.. అతను హత్య చేసిన ప్రదేశానికి తీసుకెళ్లి తగులబెట్టాడు. తర్వాత బీఎన్ రెడ్డి నగర్ లోని యువతి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో స్నానం చేసి.. సాయంత్రం అబ్దుల్లాపూర్ మెట్ పోలీసుల ముందు లొంగిపోయాడు. అయితే.. ఇంత జరిగినా హసన్, ఆ యువతి పోలీసులకు వివరాలు చెప్పకపోవడం.. నేరాన్ని దాచడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.