Advertisement
దాదాపు 15 రోజుల ఉత్కంఠకు తెరపడింది. విద్యార్థుల దెబ్బకు ప్రభుత్వం దిగివచ్చింది. వారి డిమాండ్ పరిష్కారానికి సర్క్యులర్ జారీ చేసింది. నిజాం కాలేజీ విద్యార్థినులు సాగించిన ఈ పోరాటం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రైవేట్ హాస్టళ్లలో ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నా కొత్తగా కట్టి భవనాన్ని తమకు కాకుండా పీజీ విద్యార్థులకు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు యూజీ స్టూడెంట్స్. తమ సమస్యను పరిష్కరించే వరకు తెగించి కొట్లాడతామని నిరసన బాట పట్టారు.
Advertisement
మొదట యాభై శాతం పీజీ విద్యార్థులకు, యాభై శాతం డిగ్రీ విద్యార్థులకు భవనాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానికి డిగ్రీ విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని చెప్పారు. వంద శాతం హాస్టల్ తమకే కావాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఏంటి ఆటలుగా ఉందా? అని మంత్రి కూడా హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. అయినా కూడా స్టూడెంట్స్ వెనక్కి తగ్గలేదు.
Advertisement
విద్యార్థులకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించడం మొదలు పెట్టాయి. మంత్రి సబిత ఆఫీస్, ఇల్లు ముట్టడికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇదే క్రమంలో ఆమె మరోమారు చర్చలకు పిలుపునిచ్చారు. ఎట్టకేలకు అవి ఫలించాయి. హాస్టల్ మొత్తం యూజీ విద్యార్థులకే అప్పజెబుతూ సర్క్యులర్ జారీ అయింది. హాస్టల్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ కేటాయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి సబిత.
యూజీ 2, 3 విద్యార్థులు హాస్టల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సర్క్యులర్ జారీ చేశారు. మంత్రి ఆదేశాలతో అమ్మాయిలకు హాస్టల్ వసతి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త భవనంలో యూజీ విద్యార్థులకు హాస్టల్ గదులు కేటాయించిన తర్వాత మిగిలితే పీజీ వాళ్లకు ఇవ్వనున్నారు. విద్యార్థినులను హాస్టల్ కోసం ఈనెల 19 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.