Advertisement
మొన్నటిదాకా రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య ఎలాంటి పంచాయితీలు నడిచాయో చూశాం. ప్రభుత్వ నిర్ణయాలను గవర్నర్ తప్పుబట్టడం.. ఆ వెంటనే బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఎటాక్ కొనసాగించడం జరిగాయి. అయితే.. బడ్జెట్ సమావేశాల తర్వాత అంతా సద్దుమణిగింది. కానీ, గొడవల సమయంలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన్ను చిక్కుల్లో పడేశాయి.
Advertisement
గవర్నర్ తమిళిసై పై కౌశిక్ చేసిన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయనకు నోటీసులు పంపింది. గవర్నర్ గౌరవాన్ని కించపరిచేలా కౌశిక్ వ్యాఖ్యలు ఉన్నాయని నోటీసుల్లో కమిషన్ పేర్కొంది. ఈనెల 21న ఉదయం 11.30 గంటలకు విచారణకు రావాలని ఆదేశించింది. ఒకవేళ హాజరుకాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Advertisement
ఇటీవల కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ఏ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, కౌన్సిల్ లో ఆమోదం తెలిపిన బిల్లులను గవర్నర్ తన దగ్గరే పెట్టుకున్నారని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ కామెంట్స్ పై దుమారం రేగింది.
కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో బీసీ రాజకీయ ఐకాస ఫిర్యాదు చేసింది. కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదుకై డీజీపీకి ఆదేశాలివ్వాలని కోరింది. మరోవైపు ఆయన్ను బర్తరఫ్ చేయాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. రాజ్యాంగ అత్యుత్తమ పదవిలో ఉన్న గవర్నర్ ను మహిళ అని కూడా చూడకుండా వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో జాతీయ మహిళా కమిషన్ స్పందించి నోటీసులు పంపింది.