Advertisement
దేశంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కిసాన్ బంధు అమలు చేస్తామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. గిరిధర్ తో పాటు 12 మంది మాజీ ఎమ్మెల్యేలు, నలుగురు మాజీ ఎంపీలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గిరిధర్ సేవలను కొనియాడారు కేసీఆర్.
Advertisement
దేశంలోని క్రియాశీల నాయకుల్లో గమాంగ్ ఒకరని చెప్పారు. రైతుల తరఫున అనేక కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. రైతుల సమస్యలపై గమాంగ్ పోరాటం వర్ణించలేనిదన్న కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు. ప్రపంచ దేశాల్లో కంటే భారత్ లో వనరులు ఎక్కువగా ఉన్నాయని.. కానీ, వాటిని సరిగ్గా వినియోగించుకోవడం లేదన్నారు.
Advertisement
ఎన్నికల్లో గెలవడమే నేటి నాయకులకు లక్ష్యంగా మారిందని చెప్పిన కేసీఆర్.. ఏదో విధంగా ఓట్లు సంపాదించుకోవడమే రివాజుగా మారిందన్నారు. స్వాతంత్ర్యం ఇచ్చి 75 ఏండ్లు అవుతున్నా నేటికి తాగడానికి నీళ్లు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 75 ఏండ్లలో మనం ఏం సాధించామని ప్రశ్నించారు. జాతి, ధర్మం పేరు చెప్పి గెలిచే వారు ఏం చేస్తారని.. పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు అంతేకానీ తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వరంటూ మండిపడ్డారు. దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు 13 నెలల ఉద్యమం ఎందుకు చేశారని ప్రశ్నించారు.
తెలంగాణలో అభివృద్ధి సాధ్యమైనపుడు మహారాష్ట్ర, ఒడిశాలో ఎందుకు కాదన్నారు కేసీఆర్. ఆర్థిక సమస్యలు కాదు.. చిత్తశుద్ధి లోపం వల్ల సమస్యలు ఏర్పడ్డాయని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు గెలిచే విధంగా బీఆర్ఎస్ మార్పు తెస్తుందని.. గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉందన్న కేసీఆర్.. ఇప్పటివరకు 2.10 లక్షల మెగావాట్ల విద్యుత్ కంటే ఎక్కువ వాడలేదని వివరించారు.
దేశ భవిష్యత్ ను మార్చే సంకల్పంతోనే బీఆర్ఎస్ పార్టీ అవతరించిదని తెలిపారు కేసీఆర్. సకల మానవాళి సంక్షేమమే బీఆర్ఎస్ స్వప్నమని అన్నారు. దేశంలోని అన్ని వర్గాలు సంతోషంగా ఉండేలా ఒక మహాన్ భారత్ ను నిర్మిద్దామని పిలుపునిచ్చారు.