Advertisement
ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. దీనికోసం జగన్ సైలెంట్ గా సర్వేలు చేయిస్తున్నారని రాజకీయ వర్గాల్లో ఓ చర్చ ఉంది. కేంద్ర పెద్దలతో కూడా సంప్రదింపులు జరిపారని అంటున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఏపీ సర్కార్ బూస్టప్ ఇచ్చింది. రెండు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు జరిగాయి.
Advertisement
సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు, పరిశ్రమలు రావనే విమర్శలకు ఒకే ఒక్క సదస్సుతో జగన్ సమాధానమిచ్చేశారు అంటూ వైసీపీ వర్గాలు మీడియా ముందు తెగ ఊదరగొట్టాయి. జగన్ బ్రాండ్ అంటే ఏంటో చూపించారని పొగడ్తల వర్షం కురిపించాయి. అయితే.. ప్రతిపక్షాలు మాత్రం ఇదంతా పెద్ద డ్రామాగా విమర్శలు చేస్తున్నాయి. గ్లోబల్ సమ్మిట్ పై జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ.. తీవ్ర విమర్శలు చేశారు.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం ప్రభుత్వం 170 కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు నాదెండ్ల. యువతను మభ్య పెట్టేందుకు దీన్ని నిర్వహించారని ఆరోపించారు. గతంలో జిందాల్ ఫ్యాక్టరీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని.. ఇప్పుడు మళ్ళీ ఎంవోయూ చేసుకోవడంలో అర్థం లేదన్నారు. పెట్టుబడులపై ప్రభుత్వం చెప్పినవన్నీ అంకెలగారడీలా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
Advertisement
సీ-ఫుడ్స్ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కోడిగుడ్డును సీ-ఫుడ్స్ లో కలిపి చూపడాన్ని బట్టి.. మంత్రులు ఎంత అవివేకంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చని సెటైర్లు వేశారు. తాము ఇన్వెస్టర్లను తప్పు పట్టడం లేదని, వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నామని స్పష్టం చేశారు.
మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా ఈ అంశంపై మాట్లాడారు. విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పై విమర్శలు చేశారు. రాష్ట్రానికి వచ్చాయని చెబుతున్న పెట్టుబడులన్నీ అంకెల గారడీలేనని, అవాస్తవాలేనని ఆరోపించారు. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటూ యువతను ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. పెట్టుబడుల విషయంలో నాలుగేళ్లు సీఎం నిద్రపోయారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చేసిందని.. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నిక ఉందని.. ఇదంతా ముమ్మాటికీ ఎన్నికల కోసం చేసిన స్టంట్ అంటూ విమర్శలు గుప్పించారు.