Advertisement
ఉత్తరాంధ్ర వేదికగా వైసీపీపై యుద్ధం మొదలైందన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ యువశక్తి సభ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తన భవిష్యత్ కార్యాచరణ ఏంటో చెప్పకనే చెప్పేశారు పవన్. ఓవైపు పొత్తులపై క్లారిటీ ఇస్తూనే ఇంకోవైపు వైసీపీపై చేయనున్న పోరాటాన్ని వివరించారు.
Advertisement
గత ఎన్నికల్లో 53 నియోజకవర్గాల్లో వైసీపీ సాంకేతికంగానే గెలిచిందన్నారు పవన్. తాను చంద్రబాబును కలిస్తే పిచ్చికూతలు కూస్తున్నారని మండిపడ్డారు. కొందరు నేతలు బేరాలు కుదిరాయని అన్నారని.. 25 కోట్ల పన్నులు కట్టే వ్యక్తిని.. తనకు ప్యాకేజీ ఎందుకని అధికార పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. తాను చంద్రబాబుతో భేటీ అయితే, రెండున్నర గంటలు ఏం మాట్లాడారని వైసీపీ నేతలు అడుగుతున్నారని.. ఈ సందర్భంగా అంతా వివరించారు పవన్.
Advertisement
తొలి 10 నిమిషాలు కుశల ప్రశ్నలు వేసుకున్నామన్న ఆయన.. తర్వాత 20 నిమిషాలు అంబటి అసమర్థత గురించి మాట్లాడినట్లు వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో పనికిరాని ఐటీ మంత్రి గురించి 10 నిమిషాలు మాట్లాడామని.. శాంతిభద్రతల సమస్య గురించి 38 నిమిషాలు మాట్లాడినట్లు పేర్కొన్నారు. రెండు ముక్కలైన రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసే కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు.
గెలుస్తానో ఓడిపోతానో కాదు.. తనకు పోరాటమే తెలుసన్నారు పవన్. వెధవల్ని ఎదుర్కోవడం, గూండాలను తన్నడం తెలుసని చెప్పారు. దశాబ్దం పాటు ఒంటరిగా పోరాడానని.. తనకు బలం సరిపోతుంది అనుకుంటే ఒంటరిగానైనా ఎన్నికలకు వెళ్తానన్నారు. అయితే.. ఆ నమ్మకం మీరు ఇస్తారా? అని ప్రజలను అడిగారు. ఒంటరిగా వెళ్లి వీరమారణం పొందటం అవసరం లేదు.. నియంతను కలసికట్టుగా ఎదుర్కోవాలని చెప్పారు. వచ్చే ఎన్నికలలో ఓటు చీలకూడదని.. గౌరవం తగ్గకుండా పొత్తు కుదిరితే ముందుకెళ్తామని తేల్చి చెప్పారు. లేకపోతే ఒంటరిగానే పోటీకి సిద్ధమని స్పష్టంచేశారు పవన్. దీన్నిబట్టి వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కన్ఫామ్ అయినట్టు కనిపిస్తోందని అంటున్నారు.