Advertisement
జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో తూర్పు కాపు సంక్షేమ సంఘం నేతలతో సమావేశమయ్యారు. తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యలపై వినతి పత్రం అందించారు. రిజర్వేషన్లు సహా పలు అంశాల గురించి ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. ఒక మంత్రి, ఒక ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు ఉండి కూడా ఎందుకింత ఇబ్బంది పడుతున్నాం? అని అన్నారు. తెలంగాణలో అక్కడి ప్రభుత్వ ప్రమాణాలను బట్టి రిజర్వేషన్ స్టేటస్ తీసేశారంటే ఓ అర్థం ఉంది.. కానీ ఏపీలో మూడు జిల్లాల్లోనే స్టేటస్ ఇచ్చి, మిగతా జిల్లాల్లో తూర్పు కాపులను గుర్తించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొన్నారు.
Advertisement
జనసేన పార్టీ అండగా వుంటుందని.. కానీ, మీరు పోరాటానికి ముందుకు రావాలని వారితో అన్నారు. భయపడితే ఏమీ చేయలేమన్న పవన్.. ఈ సామాజిక వర్గం నుంచి బలమైన నాయకుల్ని మీరే ముందుకు తీసుకురావాలని కోరారు. అప్పుడు వ్యవస్థలో మార్పులొస్తాయని.. 2024 తర్వాత ఇలాంటి సమావేశాలు జరగకూడదని అన్నారు. ఎవర్నీ దేహీ అని అడిగే పరిస్థితి రాకూడదన్న ఆయన.. జనసేన పార్టీకి అండగా నిలబడాలని కోరారు.
Advertisement
వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తే.. తూర్పు కాపు సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఒకవేళ చూపించని పక్షంలో, తన కాలర్ పట్టుకుని నిలదీయండని వ్యాఖ్యానించారు. కుల భావన ప్రతి ఒక్కరికీ వుండాలని.. దానర్థం, ఇతరుల్ని కించపర్చడం కాదన్నారు. మన కులానికి మనం మేలు చేసుకోవాలి అనే భావన అన్ని కులాల్లో వుండాలని సూచించారు. అన్ని కులాలూ కలిసి అభివృద్ధి చెందాలనే గొప్ప ఆలోచన కూడా వుండాలని జనసేనాని చెప్పుకొచ్చారు.
ఉత్తరాంధ్రలో ఉద్దానం సమస్యపై గతంలో తాను స్పందించానన్న పవన్.. చేయాల్సింది చేశాను.. చేస్తూనే వుంటానని తెలిపారు. బహుశా ఈ విషయం జగన్ కి తెలియకపోవచ్చు.. ఎందుకంటే ఆయన అజ్ఞానంలో వుంటారు.. ఆనక తెలిసీ తెలియని మాటలేవో మాట్లాడతారు అంటూ చురకలంటించారు. కనీసం, డిఫాక్టో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అయినా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి కదా అని ఎద్దేవ చేశారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ బలం పుంజుకుందని.. తూర్పు కాపులు మద్దతుగా నిలబడాలని కోరారు.