Advertisement
ఏపీ రాజకీయాలు రోజురోజుకీ ఇంట్రస్టింగ్ గా మారుతున్నాయి. ముఖ్యంగా జనసేన కాస్త దూకుడుగా వ్యవహరించడమే ఇందుకు కారణం. ప్రభుత్వంపై పవన్ చిన్న మాటంటే చాలు.. వరుసబెట్టి వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చేస్తుంటారు. అయితే.. ఎంతసేపు వ్యక్తిగత విమర్శలే గానీ, పవన్ లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంతో జనసేన సక్సెస్ అయింది.
Advertisement
తాజాగా ఇప్పటం అంశంలోనూ పవన్ ను హేళన చేసేలా మాట్లాడుతున్నారు వైసీపీ నేతలు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడేం సమాధానం చెప్తారని ప్రశ్నిస్తున్నారు. అయితే.. స్థానికుల బాధను చూసి తట్టుకోలేక పవన్ ఆనాడు గ్రామానికి వెళ్లారు.. అక్కడున్నవారు చెప్పిందే మీడియాతో మాట్లాడారు.. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.. చివరకు ఎన్ని విమర్శలు చేసినా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
Advertisement
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఆమధ్య కూల్చివేతలు జరిగాయి. బాధితులను స్వయంగా కలిశారు జనసేనాని. కూల్చివేతలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే.. వైఎస్ విగ్రహాలను వదిలేసి ఇళ్ల నిర్మాణాలకు సంబంధించినవి కూల్చివేయడంపై అభ్యంతరం తెలిపారు. పవన్ వెళ్లి బాధితులను పరామర్శించాక.. విషయం పెద్దదై చివరకు వైఎస్ విగ్రహాలను కూడా తీసేశారు అధికారులు. అయితే.. ఆ సమయంలో నష్టపోయిన ప్రతి ఇంటికి లక్ష రూపాయల ఆర్థికసాయం అందిస్తానని ప్రకటించారు పవన్. చెప్పినట్టే ఆదివారం నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
శనివారం సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న జనసేనానికి జనసేన వర్గాలు ఘన స్వాగతం పలికాయి. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయానికి వెళ్లారు పవన్. ఆదివారం ఇప్పటంలో నష్టపోయిన వారిని కలిసి వారికి చెక్కులు పంపిణీ చేయనున్నారు. అయితే.. హైకోర్టు తప్పుడు సమాచారం ఇచ్చిన కారణంగా గ్రామస్తులకు లక్ష రూపాయల జరిమానా వేసింది. ఇప్పుడు ఆ ఖర్చు తీర్చేందుకు పవన్ ఇచ్చే సాయంతో వారికి ఊరటగా అనిపిస్తుందని అంటున్నారు.