Advertisement
సీఎం జగన్ విశాఖ బహిరంగ సభలో ఉండగానే జనసేనాని పవన్ పోరాటం మొదలు పెట్టారు. జగనన్న మోసం హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియా ఫైట్ కు శ్రీకారం చుట్టారు. జగనన్న ఇళ్లు.. పేదలందరికీ కన్నీళ్లు అంటూ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. జగనన్న కాలనీల్లో అనేక అరాచకాలు జరిగాయని జనసేన మొదట్నుంచి విమర్శిస్తోంది. లబ్ధిదారుల కేటాయింపు పారదర్శకంగా జరగలేదని.. రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అని అంటోంది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది.
Advertisement
ప్రధాని మోడీతో భేటీ అయిన తర్వాత రోజే ఈ కార్యక్రమం స్టార్ట్ కావడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు విశాఖ పర్యటనలో ఉన్న పవన్ సడెన్ గా సాగర తీరంలో కనిపించారు. ఉదయం నుంచి పార్టీ నేతలతో భేటీ అయిన పవన్.. సాయంత్రానికి బీచ్ లో దర్శనమిచ్చారు. కాసేపు వాకింగ్ చేశారు. ఓ మత్స్యకారుడు కనిపిస్తే కాసేపు మాట్లాడారు.
Advertisement
పవన్ బీచ్ కు వెళ్లారని తెలియడంతో మీడియా ప్రతినిధులు ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకున్నారు. తర్వాత విషయం అభిమానులకు తెలియడంతో జనం తాకిడి పెరిగింది. దీంతో ఆయన అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. దారిపొడవునా జనం ఆయనతో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఇక అక్కడినుంచి పవన్ వివాదాస్పద రిషికొండను పరిశీలించారు. తవ్వకాలు జరుపుతున్న ప్రాంతాల చుట్టూ బారికేడ్లు అడ్డుగా ఉండడంతో.. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియకూడదనే ఇలా చేశారని అన్నారు జనసేనాని. రుషికొండను మింగేస్తున్న వైసీపీ ప్రభుత్వ తీరును కనులారా వీక్షించామని చెప్పారు.
చాలా రోజుల నుంచి విశాఖ రుషికొండ చుట్టూ రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి ధ్వంసం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే.. అలాంటిదేం లేదని వైసీపీ చెబుతూ వస్తోంది. కానీ, ప్రతిపక్షాలను మాత్రం రుషికొండను పరిశీలించేందుకు అనుమతించడంలేదు. ఇటీవల టీడీపీ నేతలు తవ్వకాలను పరిశీలించేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు పోలీసులు. పవన్ ఇటీవల విశాఖ పర్యటన సందర్భంగా రుషికొండ తవ్వకాలపై ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా తవ్వకాలను పరిశీలించారు.