Advertisement
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరంటారు. ఉదయం ఒక పార్టీలో ఉన్న లీడర్.. సాయంత్రానికి ఇంకో కండువాతో కనిపిస్తుంటాడు. బండ బూతులు తిట్టిన వ్యక్తే తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చి పొగిడేస్తుంటాడు. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు.. జంపింగ్స్ పాలిటిక్స్ లో కామనే. తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడేకొద్దీ చేరికలు ఊపందుకుంటున్నాయి. తాజాగా బీజేపీలోకి బూర నర్సయ్య గౌడ్ వెళ్లగా.. ఆపార్టీ నుంచి స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ లో చేరారు.
Advertisement
అయితే.. దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ లో చేరికపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ‘‘శ్రవణ్ గొప్ప బలమైన నాయకుడు. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి తెలంగాణ రాష్ట్ర ఆశయ సాధన కోసం చేరారు. ఏ రాజకీయ పార్టీలో ఉన్నా.. నిత్యం తెలంగాణ అభివృద్ధి, ఆకాంక్షలు, తెలంగాణ హక్కుల సాధన కోసం పోరాటం చేస్తూనే ఉంటారు. మిత్రుడు శ్రవణ్ భవిష్యత్తులో తలపెట్టే కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని, రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’’
Advertisement
ఇదీ.. శ్రవణ్ గులాబీ కండువా కప్పుకోగానే పవన్ విడుదల చేసిన ప్రకటన. దీనిపై సర్వత్రా చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ లో చేరిన శ్రవణ్ ను పొగడడం ఏంటి? అది కూడా మిత్ర పక్షం బీజేపీ నుంచి వెళ్లిపోతే మద్దతు తెలపడం ఏంటనే దాని చుట్టూ అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈమధ్యే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు కేసీఆర్. తీర్మానం చేసి ఫైల్ ను ఈసీ దగ్గరకు పంపారు. కానీ, అది అక్కడ పెండింగ్ లో ఉంది. ఆ విషయం అటుంచితే.. బీఆర్ఎస్ జాతీయ పార్టీ కావడానికి కొన్ని నియమాలున్నాయి. ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పలు పార్టీల నాయకులతో కేసీఆర్ టచ్ లోకి వెళ్లారని ప్రచారం సాగుతోంది.
మరీ ముఖ్యంగా ఆంధ్రాపై కేసీఆర్ ఎక్కువ ఫోకస్ పెట్టారని సమాచారం. ఒకప్పుడు టీడీపీలో తనతోపాటు పని చేసినవాళ్లు.. వాళ్లకు తెలిసినవాళ్లతో సంప్రదింపులు చేస్తున్నారని టాక్. ఇదే సమయంలో వైసీపీ నేతలతోపాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను కూడా టచ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే బీఆర్ఎస్ తో జనసేన పొత్తు ఉంటుందనే వార్తలు కూడా వచ్చాయి. కరెక్ట్ గా ఇదే సమయంలో పవన్ మిత్రపక్షం బీజేపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన శ్రవణ్ ను పొగుడుతూ ప్రకటన చేయడం అనేక అనుమానాలకు తావిచ్చినట్లు అయిందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.