Advertisement
వైసీపీలో పవన్ కళ్యాణ్ ని తిట్టడమే పనిగా పెట్టుకున్న వాళ్లలో మాజీ మంత్రి పేర్ని నాని ఒకరు. మంత్రి పదవి పోయాక ఈయన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. కాకపోతే, పవన్ ఏదైనా మాట్లాడగానే.. వెంటనే మీడియా ముందుకొచ్చేస్తుంటారు. అయితే.. పేర్ని ఇలాకాలో జనసేన పదో ఆవిర్భావ సభ జరుగుతోంది. దీంతో పవన్ స్పీచ్ ను ముందే ఊహించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు నాని.
Advertisement
జనసేన సభ కేవలం చంద్రబాబు, పవన్ ల తస్మదీయ దూషణల సభేనని అన్నారు. ‘‘మనం ఏం చేశాం.. మనలో లోపాలేంటి అనేది చర్చించుకోవడం రాజకీయ పార్టీ లక్షణం.. కానీ, చంద్రబాబు సేవ కోసమే పవన్ రాజకీయ పార్టీ పెట్టారు’’ అంటూ మండిపడ్డారు. తన పార్టీని అభిమానించే వారందరినీ చంద్రబాబుకు ఓటేయమంటున్నారని ఎద్దేవ చేశారు. ఇప్పటం సభకు.. మచిలీపట్నం సభకు పెద్ద తేడా ఉండబోదన్నారు.
Advertisement
జగన్ ను బలపరిచే కాపు నాయకులని తిట్టడం చంద్రబాబును బలపరచడం కోసమే ఈ సభ అని పేర్ని నాని పేర్కొన్నారు. కాపు కులాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టే ప్రయత్నం పవన్ చేస్తున్నాడని విమర్శించారు. పవన్ రాజకీయ సినిమా.. ఫ్లాప్ అయినా.. హిట్ అయినా? పెద్దగా నష్టం లేదన్నారు. ప్యాకేజీ స్టార్ అంటే ఇష్టం లేదు కానీ.. స్టార్ ప్యాకేజీ అంటే పవన్ కు ఇష్టమని విమర్శించారు. చంద్రబాబును విమర్శించే వారిని తిట్టడం.. ముఖ్యంగా వైసీపీలోని కాపు నేతలను టార్గెట్ చేయడమే పవన్ పనిగా పెట్టుకున్నారని అన్నారు.
పేర్ని వ్యాఖ్యలకు జనసేన శ్రేణులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నాయి. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేస్తే అడగకూడదా? అభివృద్ధి మరిచి దోచుకోవడమే పనిగా పెట్టకుంటే ప్రశ్నించకూడదా? వాటి గురించి అడిగితే మాత్రం కోపం వచ్చేస్తుందా? అంటూ మండిపడుతున్నాయి. ఇటు మచిలీపట్నంలో జనసేన సభ పెట్టేసరికి పేర్ని నానికి కాళ్లూ చేతులు ఆడడం లేదని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు జనసైనికులు.