Advertisement
ఎమ్మెల్యేల ఎర కేసులో హైకోర్టు సంచలన తీర్పు తర్వాత.. మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. ఈ తీర్పుపై తమ న్యాయవాదితో మాట్లాడినట్లు తెలిపారు. తీర్పు కాపీ వచ్చాక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈడీ, సీబీఐని ప్రయోగిస్తామని దొంగ స్వాములు చెప్పారని.. వారు చెప్పినట్లే జరుగుతోందన్నారు ఈడీ విచారణలో ఎలాంటి అంశం దొరకలేదని.. ఇప్పుడు సీబీఐని రంగంలోకి దింపుతున్నారని మండిపడ్డారు.
Advertisement
న్యాయ వ్యవస్థపై తమకు సంపూర్ణ నమ్మకం ఉందన్న రోహిత్ రెడ్డి.. తీర్పు కాపీ వచ్చాక డివిజన్ బెంచ్ కు వెళ్లాలా లేక సుప్రీంకోర్టుకు వెళ్లాలా అనేదానిపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. సిట్ ను తప్పించి సీబీఐకి కేసు ఇవ్వడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఈడీ పరిధిలోకి రాకపోయినా తనను విచారణకు పిలిచారని.. న్యాయ వ్యవస్థలో ఉన్న సాంకేతిక అంశాలు అడ్డు పెట్టుకుని బీజేపీ నేతలు మాత్రం విచారణకు రావడం లేదని మండిపడ్డారు.
Advertisement
ఈడీ, సీబీఐ ఏది వచ్చినా తాము సిద్ధంగానే ఉన్నామన్న ఆయన.. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈడీ విచారణపై కోర్టులో రిట్ పిటిషన్ వేశామని.. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఎమ్మెల్యేల ఎర కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. తీర్పును వెంటనే అమలు చేయొద్దని కోరింది. కేసుకు సంబంధించి తీర్పు ఫైనల్ కాపీ వచ్చే వరకు ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయకుండా చూడాలని వేడుకుంది. ఈక్రమంలో అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తిని పరిశీలించిన కోర్టు.. ఫైనల్ కాపీ వచ్చే వరకు జడ్జిమెంట్ ను సస్పెన్షన్ లో ఉంచుతున్నట్లు ప్రకటించింది.
మరోవైపు ఈడీ అధికారులు నందకుమార్ ను విచారించారు. రోహిత్ రెడ్డితో ఉన్న డీలింగ్స్ పై గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేశారు. సుమారు 5 గంటల పాటు ప్రశ్నించారు అధికారులు. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ సుమిత్ గోయల్, దేవేందర్ సింగ్, వీర నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఇది జరిగింది. ఎమ్మెల్యేలకు ఎర కేసుతో పాటు రోహిత్ రెడ్డితో సంబంధాలు, వ్యాపార లావాదేవీలపై ఆరా తీశారు. నందకుమార్ పై ఉన్న కేసుల వివరాలను కూడా సేకరించారు.