Advertisement
తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యామిలీకి ఉన్నక్రేజ్ అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నా.. పవన్ కు మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే.. జనసేన ఏపీలో ఉన్నంత యాక్టివ్ గా తెలంగాణలో లేదు. కానీ, ఫ్యాన్స్ కు కొదవేం లేదు. ఏపీలో బీజేపీతో పొత్తు కొనసాగిస్తోంది జనసేన. తెలంగాణలో మాత్రం నేతల మధ్య సఖ్యత ఉన్నా ఇరు పార్టీలు కలిసి కార్యక్రమాలు చేసింది లేదు.
Advertisement
బీజేపీ ఈసారి దక్షిణాదిపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై దృష్టి సారించింది. తెలంగాణలో ఈసారి గెలుపు పక్కా అనే ధీమాతో ఉంది. కానీ, ఏపీలో మాత్రం జనసేన మద్దతు తప్పదు. సరిగ్గా ఇలాంటి సమయంలో మెగా ఫ్యామిలీతో మరింత సఖ్యత కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సమయంలోనే దీనిపై అనేక అనుమానాలు కలిగాయి. ఆనాడు.. మోడీని చిరంజీవి సన్మానించారు. ఓ నిమిషం పాటు ఆత్మీయంగా సంభాషించారు. సభకు వచ్చిన వారితో పాటు టీవీల్లో చూస్తున్న వారికి కూడా దీనిపై ఆసక్తి కలిగించింది. బాగా పరిచయమున్న వారిలా వీరిద్దరూ మాట్లాడుకోవడమే దానికి కారణం. మోడీతో చిరంజీవికి ఇంత సాన్నిహిత్యం ఉందా అని కొంత మంది ఆశ్చర్యపోయారు. కార్యక్రమం అసాంతం.. చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Advertisement
మొన్న ఏపీ టూర్ కు వచ్చిన మోడీ.. 8 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ను కలిశారు. మీటింగ్ అంశాలు సీక్రెట్ గా ఉన్నా.. రాష్ట్ర రాజకీయాలకు మంచి భవిష్యత్తు కోసం ఆయన నిర్ణయాలు ఉంటాయని పవన్ అన్నారు. బీజేపీ నేతలు వచ్చే ఎన్నికల్లో జనసేనతోనే తమ ప్రయాణం అని ప్రకటించారు. దీనిపై రకరకాల చర్చలు కొనసాగుతుండగానే.. మెగాస్టార్ చిరంజీవిని ‘ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022’ పురస్కారం కోసం ఎంపిక చేసింది కేంద్రం. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోడీ కూడా దీనిపై స్పందించారు. తెలుగులో ట్వీట్ చేసిన ఆయన మెగాస్టార్ కు అభినందనలు తెలిపారు.
అనురాగ్ ఠాకూర్ ట్వీట్ ను రీట్వీట్ చేసిన మోడీ.. ‘‘చిరంజీవి గారు విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్నీ, ఆదరణనూ చూరగొన్నారు. గోవా లో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో విశిష్టమైన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఆయనకు అభినందనలు’’ అని కొనియాడారు. మోడీ ట్వీట్ పై చిరంజీవి రిప్లై ఇచ్చారు. ‘‘గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ మీ మంచి మాటలకు చాలా కృతజ్ఞతలు’’ అని ట్వీట్ చేశారు. చిరంజీవిపై మోడీ ప్రశంసల వర్షం కురిపించడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో ఇంకో పది నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో మెగా ఫ్యామిలీపై బీజేపీ చూపుతున్న ప్రేమ వెనుక పెద్ద ప్లానే ఉందంటున్నారు విశ్లేషకులు.