Advertisement
దేశంలోనే అతి పెద్ద విషాదాల్లో ఒకటిగా నిలిచింది మోర్బీ కేబుల్ బ్రిడ్జ్ ఘటన. 141 మంది జల సమాధి అయ్యారు. వందల మంది గాయపడ్డారు. ఇంకా చాలామంది ఆచూకీ లభించాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ట్విట్టర్ ద్వారా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్లిష్ట సమయంలో భారత ప్రజలకు అండగా నిలుస్తామని చెప్పారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా సంతాపం తెలియజేశారు.
Advertisement
చాలామంది గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ మోర్బీ జిల్లాలో పర్యటించారు. ముందుగా కేబుల్ బ్రిడ్జ్ ప్రదేశాన్ని సందర్శించారు. ఘటన జరిగిన తీరును, సహాయక చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గల్లంతయిన వారికోసం గాలిస్తున్నామని అధికారులు ఆయనకు వివరించారు. ఆ తర్వాత అక్కడి నుంచి బాధితులు చికిత్స పొందుతున్న సివిల్ ఆసుపత్రికి వెళ్లారు మోడీ.
Advertisement
ట్రీట్ మెంట్ తీసుకుంటున్న వారిని పరామర్శించారు. వారికి అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. ప్రధాని వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా ఉన్నారు. ఇటు మోడీ వస్తున్నారని తెలిసి సివిల్ ఆసుపత్రిలో హడావుడిగా సిబ్బంది పారిశుద్ధ్య చర్యలు చేపట్టడం రాజకీయ రంగు పులుముకుంది. గోడలకు పెయింట్ వేయడం, బెడ్స్ పై కొత్త షీట్లు కప్పడం, కొత్తగా వాటర్ కూలర్లు ఏర్పాటు చేయడం వంటివి చూసి ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.
ఇదంతా మోడీ ఫోటోషూట్ కోసం చేస్తున్నట్టు ఉందని ఆరోపిస్తున్నాయి. శవాల మీద బీజేపీ నిర్వహిస్తున్న ఈవెంట్ మేనేజ్మెంట్ లా ఉందని నేతలు విమర్శలు చేశారు. అసలు బాధితులకు మెరుగైన వైద్యం అందుతోందా అన్నదే ముఖ్యమని అన్నారు.