Advertisement
తెలంగాణలో ఎన్నో ఏళ్ల తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చాయి. ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని తగ్గించేందుకు వరుసబెట్టి నోటిఫికేషన్లు వదిలారు కేసీఆర్. అయితే.. ఆ తర్వాత కూడా వివాదాలు చెలరేగుతున్నాయి. పోలీస్ కానిస్టేబుళ్లు, ఎస్సై ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. సివిల్ పోలీస్ కానిస్టేబుల్ విభాగంలో 15,664, ఎక్సైజ్ విభాగంలో 614, రవాణా శాఖలో 63 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే.. కానిస్టేబుల్ పరీక్షల్లో కొన్ని ప్రశ్నలు తప్పులుగా ఉన్నాయని అభ్యర్ధులు గతంలో ఆందోళన నిర్వహించారు.
Advertisement
మార్కుల పంచాయితీ నడుస్తుండగా.. ఫిజికల్ టెస్టుల విషయంలోనూ గందరగోళం నెలకొంది. లాంగ్ జంప్ 3.8 మీటర్ల నుండి 4 మీటర్లకు పెంచడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అభ్యర్థులు నిరసనబాటపట్టారు. వీరికి ఇతర పార్టీల నేతలు అండగా నిలబడడంతో ఆందోళనలు ఉగ్రరూపం దాల్చాయి. ఈ క్రమంలోనే సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి పలు పార్టీల నేతలు, పోలీస్ అభ్యర్థులు హాజరయ్యారు. ఆర్మీలో లేని నిబంధనలను అభ్యర్థులకు పెడ్తున్నారని టీజేఎస్ అధినేత కోదండరాం అన్నారు. కష్టపడి చదివి ప్రిలిమ్స్ పాస్ అయిన అభ్యర్థులు కఠిన నిబంధనల కారణంగా ఉద్యోగానికి దూరమవుతున్నారని మండిపడ్డారు. ఫిజికల్ టెస్ట్ లో ప్రమాణాలు చాలా కఠినంగా ఉన్నాయని.. వెంటనే వాటిని సరళించాలని డిమాండ్ చేశారు.
Advertisement
అయితే.. కార్యక్రమం ముగిసిన తర్వాత అభ్యర్థులు ప్రెస్ క్లబ్ లో దీక్షకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎంత చెప్పినా వినకుండా వారు నిరాహార దీక్షకు దిగారు. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అభ్యర్థుల ఆమరణ దీక్షను భగ్నం చేశారు. దీక్షాస్థలికి చేరుకుని అందర్నీ బలవంతంగా అరెస్టు చేశారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభ్యర్థులు నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు పోలీస్ అభ్యర్థులు తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. 9వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.
6న దున్నపోతులకు వినతి పత్రాలు
7న అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా
9న చలో హైదరాబాద్ పిలుపు