Advertisement
సినిమా ఇండస్ట్రీలో వైసీపీ సానుభూతిపరులు చాలామందే ఉన్నారు. కొందరు బహిరంగంగా మద్దతు పలికితే.. కొందరు సైలెంట్ గా ఉంటూనే జగన్ కు అండగా ఉంటున్నారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చాలామంది సినీ ప్రముఖులు చేశారు. వారిలో అందరూ ఇప్పుడు ఆ పార్టీలో లేరు. మిగిలిన వారు కూడా చేజారిపోకుండా వారిని బుజ్జగించే పనిలో ఉన్నారు జగన్.
Advertisement
మోహన్ బాబు, జీవిత, రాజశేఖర్, అలీ, పృథ్వీరాజ్, కృష్ణుడు.. ఇలా పలువురు నటీనటులు జగన్ ను కలిసి సంఘీభావం తెలిపి వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే.. పోసాని కృష్ణమురళి మాత్రం పార్టీలో చేరకుండా వైసీపీ సానుభూతిపరుడిగా ఉంటూ వస్తున్నారు. అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి హడావుడి చేస్తున్నారు. ఆమధ్య పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసి.. జనసైనికుల ఆగ్రహానికి గురయ్యారు. తర్వాత సైలెంట్ అయిపోయారు. అయితే.. ఇన్నాళ్లకు పోసానికి శుభవార్త అందించారు జగన్.
Advertisement
ఏపీ ఫిల్మ్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన్ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈమధ్యే అలీని ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. వీళ్లిద్దరికి పదవులు దక్కడం చాలా ఆలస్యమే అయింది. పలు సందర్భాల్లో పోసాని దీనిపై బహిరంగంగానే స్పందించారు. జగన్ కు ఎప్పుడు ఏం చేయాలో తెలుసని.. తాను పదవులను ఆశించడం లేదన్నారు. కాకపోతే ఏదైనా ఇస్తే సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. అదే సమయంలో జూనియర్లకు పదవులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు కూడా.
అయితే.. ఎట్టకేలకు పోసానికి పదవి వరించింది. కాస్త గ్యాప్ తర్వాత అయినా కీలక పోస్టును అప్పగించింది జగన్ సర్కార్. ఇన్నాళ్లూ పార్టీనే నమ్ముకున్నందుకు తగిన న్యాయం చేసింది. ఏపీ ఫిలిం డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పోసాని.. సీఎం జగన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.