Advertisement
తెలంగాణలో గెలుపు జెండా ఎగురవేయాలని చూస్తున్న పార్టీల్లో వైటీపీ ఒకటి. మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల సారథ్యంలో ఈ పార్టీ నడుస్తోంది. రాజన్న రాజ్యం తీసుకొస్తానని ప్రజాప్రస్తానం పేరుతో ఆమె పాదయాత్ర కూడా చేస్తున్నారు. అయితే.. ఈ యాత్రకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవడంతో నిత్యం వార్తల్లో ఉంటున్నారు షర్మిల. కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేసుకుంటూ ప్రెస్ మీట్లు, ప్రకటనలతో తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నారు. జాతీయ మీడియాలో సైతం కవర్ అయ్యేలా చూసుకుంటున్నారు.
Advertisement
పాదయాత్రలో జరిగిన దాడికి నిరసనగా ఆమధ్య ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు షర్మిల. అయితే.. పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఆమె కారులో ఉండగానే క్రేన్ తో లాక్కెళ్లడం చర్చనీయాంశమైంది. దీనిపై ఇతర పార్టీల నేతలు కూడా స్పందించారు. కేసీఆర్ తీరును తప్పుబడుతూ విమర్శల దాడి చేశారు. ప్రధాని మోడీ సైతం ఈ ఘటనపై స్పందించారు.
Advertisement
షర్మిలకు ప్రధాన మంత్రి మోడీ ఫోన్ చేసి మాట్లాడారు. అరెస్ట్ వ్యవహారంపై ఆరా తీసినట్లు తెలిసింది. ఆమెపై జరిగిన దాడి పట్ల ఆయన సానూభూతి వ్యక్తం చేసినట్లు సమాచారం. దాదాపు పది నిమిషాల పాటు షర్మిలతో మాట్లాడిన ప్రధాని.. అన్ని విషయాలు తెలుసుకున్నారట. దీనిపై షర్మిల స్పందించారు. ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఆయన మాత్రమే కాదు ఎంతోమంది స్పందించారని చెప్పారు.
ఒక ఆడబిడ్డ ప్రజల కోసం పాదయాత్ర చేస్తే అడ్డుకోవడం, అరెస్ట్ చేయడం అన్యాయమని చాలా మంది సానుభూతి వ్యక్తం చేశారని అన్నారు షర్మిల. స్పందించకుండా కూడా బాధపడ్డ వారు ఎంతోమంది ఉన్నారని.. అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. షర్మిలను నడిపిస్తోంది బీజేపీనే అని విమర్శలు చేస్తోంది టీఆర్ఎస్. ఇలాంటి సమయంలో మోడీ ఆమెకు ఫోన్ చేయడంపై అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. గులాబీ నేతలు ఈ వ్యవహారంపై ఘాటుగా రిప్లై ఇచ్చే ఛాన్స్ ఉంది.