Advertisement
పవిత్ర అయోధ్య నగరంలో దీపావళి సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా ఈకార్యక్రమాననికి హాజరయ్యారు. దీపోత్సవ్ పాల్గొన్న ఆయన.. శ్రీరామ పట్టాభిషేకాన్ని తన చేతుల మీదుగా నిర్వహించారు. సరయూ నదికి ప్రత్యేక హారతి ఇచ్చారు. దీపోత్సవ్ సందర్భంగా అయోధ్యలో 18 లక్షల దివ్వెలను వెలిగించారు. నదీ తీరం వెలిపోయింది.
Advertisement
వేల కోట్లతో శ్రీరామ నగరాన్ని అభివృద్ది చేస్తున్నామని, జీవితంలో ఒక్కసారైనా అయోధ్యను దర్శించుకోవాలని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. సబ్ కా వికాస్ అన్న నినాదం రాముని స్ఫూర్తి నుంచి వచ్చిందేనన్నారు. శ్రీరామ్ లీలా దర్శనం, రాముని రాజ్యాభిషేకం, రాముని సంకల్ప సిద్ధి ఈ దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకుపోతాయని పేర్కొన్నారు.
Advertisement
75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాల వేళ దీపావళి పండుగను జరుపుకుంటున్నామన్న ఆయన.. ఇది మన దేశానికే పెద్ద పండుగ అని అభివర్ణించారు. ప్రయాగ్ రాజ్ లోని శృంగవేర్పూర్ ధామ్ వద్ద 51 అడుగుల పొడవైన రాముడి విగ్రహం, నిషధరాజు విగ్రహం ఏర్పాటు కానున్నాయని తెలిపారు. శ్రీరాముని ఆశయాలను భారతీయులు అనుసరించాలన్నారు.
‘సత్యమేవ జయతే’ నినాదంతో మనం ఈ సెలబ్రేషన్స్ ని ప్రారంభించామని, భారత సాంస్కృతిక వికాసాన్ని ఇది ప్రతిబింబిస్తుందని ఈ సందర్భంగా మోడీ పేర్కొన్నారు. ఇది ఆశా కిరణాన్నిమెరిపించే రోజని, మానవాళికి శుభాన్ని అందించే రోజని చెప్పారు. మోడీ నిర్వహించిన రాముని రాజ్యాభిషేక కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. అంతకుముందు మోడీ శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర స్థలాన్ని సందర్శించారు.