Advertisement
తెలంగాణ కాంగ్రెస్ లో ఎలాంటి మార్పు లేదు. సీనియర్లు తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. పైగా.. బీజేపీ నేతలు సీనియర్లతో మంతనాలు జరుపుతున్నారు. రాజగోపాల్ రెడ్డి అయితే ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. బండి సంజయ్ కూడా ఫోన్ లో సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిన చక్కబెట్టేందుకు ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారని ప్రచారం సాగుతోంది.
Advertisement
ముందుగా అనుకున్నట్టే మంగళవారం సాయంత్రం 4 గంటలకు మహేశ్వర్ రెడ్డి నివాసంలో సీనియర్లు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కు నివేదించాల్సిన అంశాల ఎజెండాను ఇందులో ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. భట్టి విక్రమార్క నివాసానికి తరలివచ్చిన నేతలతో పాటు మరికొందరు సీనియర్ నేతలను కూడా ఇందులో పాల్గొనేలా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. రోజురోజుకూ పరిస్థితి చేజారిపోతుండడంతో ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారని టాక్ నడుస్తోంది.
Advertisement
పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని చక్కబెట్టే పనిలో భాగంగా.. ఏదైనా సమస్యలుంటే ఢిల్లీకి వచ్చి చెప్పాలని సీనియర్లకు సూచించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇంఛార్జ్ కార్యదర్శులు ఎప్పటికప్పుడు పరిస్థితులపై హైకమాండ్ కు అన్నీ నివేదిస్తున్నారు. ఈక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రియాంక గాంధీ ఫోన్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. పార్టీలో నెలకొన్న విభేదాలతో పాటు అసమ్మతికి గల కారణాలపై ఆరా తీసినట్టు టాక్. ఈ నేపథ్యంలో సీనియర్ల భేటీ ఉంటుందా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.
సీనియర్ నేతలు అభ్యంతరాలను సరిచేసేందుకు టీపీసీసీ ఇప్పటికే 13 మంది వలస నేతల చేత రాజీనామా చేయించింది. తాము పదవుల కోసం ఆశపడటం లేదని, పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తామని వారు కూడా ప్రకటన చేశారు. కాంగ్రెస్ లో చేరి నాలుగేళ్లు అయిందని.. ఇంకా తమను ఆ విధంగా చూడడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత జరిగినా సీనియర్లు మాత్రం పట్టు విడవడం లేదు. ఇప్పుడు ప్రియాంక ఇంట్రీ ఇవ్వడంతో సర్దుకుపోతారో లేదో చూడాలి.