Advertisement
కర్ణాటక పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయి ఏడాది పూర్తయింది. గతేడాది అక్టోబర్ 9న ఆయన కాలం చేశారు. కుటుంబసభ్యులను, అభిమానులకు శోకసంద్రంలో పడేసి చిన్న వయసులోనే పునీత్ అనంతలోకాలకు వెళ్లాపోయారు. అయితే.. కర్ణాటక రాజ్యోత్సవం సందర్భంగా పునీత్ రాజ్ ను సన్మానించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం బెంగళూరులో భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. పలువురు ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు.
Advertisement
రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారమైన ‘కర్ణాటక రత్న’తో పునీత్ రాజ్ కుమార్ ను సత్కరించింది బీజేపీ ప్రభుత్వం. పునీత్ తరఫున ఆయన భార్య ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ వేడుకకు స్పెషల్ గెస్టులుగా సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అభిమానులు అలాగే కూర్చున్నారు.
Advertisement
రజనీకాంత్ మాట్లాడుతూ.. పాత విషయాలన్ని గుర్తు చేసుకున్నారు. 1979లో రాజ్ కుమార్ నాలుగు సంవత్సరాల పునీత్ ను ఎత్తుకుని శబరిమలకు వచ్చారని ఆరోజే తనను మొదటిసారి చూశానని అన్నారు. తరువాత అప్పు 100 రోజుల వేడుకకు రాజ్ కుమార్ కోరిక మేరకు హాజరై పునీత్ ను ఆశీర్వదించానని చెప్పారు. దేవుడు పుట్టించిన వ్యక్తులు చేసే సేవ చూసి వారిని దేవుడి బిడ్డల్లా చూస్తారని, ప్రపంచంలో కొంత మంది మాత్రమే అలా ఉంటారని.. వారిలో పునీత్ కూడా ఒకరని తెలిపారు. నటుడిగానే కాకుండా సమాజసేవకుడిగా అప్పు కోట్లాది మంది కన్నడిగుల గుండెల్లో నిలిచిపోయారని కొనియాడారు.
ఇక ఎన్టీఆర్ కన్నడలో అనర్గళంగా మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. నటుడిగా తాను సాధించిన విజయాల వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని.. పునీత్ స్నేహితుడిగా వచ్చానని చెప్పారు. కుటుంబం నుంచి వారసత్వం, ఇంటిపేరు మనకు వస్తాయి కానీ.. వ్యక్తిత్వాన్ని సొంతంగా సంపాదించుకోవాలని అన్నారు. అహం, అహంకారం అనేవి లేకుండా తన వ్యక్తిత్వం, చిరునవ్వుతో మొత్తం రాష్ట్రాన్ని గెలుచుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పునీత్ రాజ్ కుమార్ మాత్రమేనని కొనియాడారు ఎన్టీఆర్.